ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల్లో దాదాపు ఎక్క‌డ చూసినా.. ప్ర‌జ‌ల్లో క‌రోనా మ‌హ‌మ్మారి భ‌య‌మే క‌నిపిస్తోంది. గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన ఈ కొత్తరకం కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచ మొత్తం క‌మ్మేసింది. చిన్నా.. పెద్దా, ఉన్నోడు.. లేనోడు అనే తేడా లేకుండా అంద‌రికీ క‌రోనా భూతం ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. ఈ క్ర‌మంలోనే ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మ‌రెంద‌రో క‌రోనా సోకి.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క‌రోనా మృత్యుఘంటికలు మోగిస్తున్న వేళ అన్ని దేశాలు వ్యాక్సిన్‌పైనే ఫోక‌స్ చేశాయి. అయితే ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తున్న కరోనా వైరస్‌కు అడ్డుక‌ట్ట వేసే వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుందో అర్థంకాని ప‌రిస్థితి. 

 

అందుకే మ‌న జాగ్ర‌త్త‌ల్లో మ‌న ఉండ‌డం చాలా ముఖ్యం. కానీ, మనకు నిత్యవసరాలు, అత్యవసరాలు, మందుల వంటివి తప్పనిసరిగా కావాలి కాబట్టి... వాటి కోసం ఇంట్లోంచి ఖ‌చ్చితంగా బయటకు వెళ్తుంటారు. ఈ స‌మ‌యంలో క‌రోనా నుంచి ర‌క్షించుకోవాలంటే ఖ‌చ్చితంగా కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాలి. ముఖ్యంగా మీరు బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు ముఖానికి మాస్కు, చేతులపై శానిటైజర్ ఉండేలా చేసుకోవాలి. ఇంట్లో ఒక్కరు మాత్రమే.. అది కూడా ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే నిత్య‌వ‌స‌ర స‌రుకుల‌కు లేదా ఇత‌ర‌వాటి కోసం బయటకు వెళ్లాలి.  అలాగే బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు ఏ ప్రదేశాలు అంటే గొట్టాలు, రాడ్లు, డోర్లను ముట్టుకోవద్దు.

 

తప్పనిసరి ముట్టుకోవాల్సి వస్తే... మిగతావారు ముట్టుకోని ప్రదేశంలో ప‌ట్టుకోవ‌డం లేదా ప‌ట్టుకున్న వెంట‌నే చేతుల‌కు  శానిటైజర్ రాసుకోవాలి. ఇక కరెన్సీ బదులు కార్డుతో చెల్లింపులు చేస్తే మరీ మంచిది. అలాగే ఎక్క‌డైనా స‌రే ఇత‌రుల‌కు మీరు 6 అడుగుల దూరంలో నిల్చోవాలి. ఇక మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే.. షాపులు, సూపర్ మార్కెట్ల దగ్గర వీలైనంత తక్కువ సేపు ఉండాలి. వెళ్లామా, కావాల్సిన‌వి తీసుకున్నామా, వచ్చేశామా అన్నట్లుగా ట‌పాట‌పా షాపింగ్ అయిపోవాలి. ఇక మీరు ఇంటికి తెచ్చుకున్న సామాన్లను నీటితో కడిగే ఛాన్స్ ఉన్న వాటిని ఖ‌చ్చితంగా నీటితో కడగాలి.  పండ్లు, కూరగాయలు అయితే ఉప్పు నీరు లేదా నిమ్మకాయ రసం కలిపిన నీటిలో క‌డిగితే మ‌రీ మంచిది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: