రాహుల్‌ గాంధీకి స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు లద్దాఖ్ ఎంపీ జమాంగ్‌ సెరింగ్‌. కాంగ్రెస్‌ హయాంలోనే భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని... ఆధారాలతో సహా ట్వీట్ చేశారు. ఇకపై ప్రజలను తప్పుదోవ పట్టించరని భావిస్తున్నా అంటూ రీ ట్వీట్ చేశారు. లద్దాఖ్‌లోని భూభాగాన్ని చైనా ఆక్రమించిందా అంటూ.... రాజ్‌నాథ్‌ సింగ్‌ను రాహుల్‌ ప్రశ్నించగా... జమాంగ్‌ రిప్లై ఇచ్చారు. 

 

ఆర్టికల్‌ 370 రద్దు సమయంలో పార్లమెంట్‌లో కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పట్టించిన లద్దాఖ్‌ ఎంపీ జమాంగ్‌ సెరింగ్‌... మరోసారి రాహుల్ గాంధీకి చురకలంటించారు. రాహుల్ అడిగిన ప్రశ్నకు అదే రేంజ్‌లో కౌంటర్‌ ఇచ్చారు. లద్దాఖ్‌లోని భూభాగాన్ని చైనా ఆక్రమించిందో లేదో చెప్పాలంటూ రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ట్విట్టర్ వేదికగా రాహుల్ ప్రశ్నించారు. దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని కోరారు. 

 

రాహుల్ ట్వీట్‌పై స్పందించిన జమాంగ్ సెరింగ్‌...కాంగ్రెస్‌ హయాంలోనే చైనా భారత భూభాగాన్ని ఆక్రమించుకుందని రీ ట్వీట్ చేశారు. ఇవే ఆధారాలంటూ పలు సందర్భాల్లో చైనా ఆక్రమించిన ప్రదేశాలను సూచిస్తూ...వివరాలను షేర్ చేశారు. అంతేకాదు రాహుల్ గాంధీ తాను చేసిన ట్వీట్‌తో అంగీకరిస్తారనే భావిస్తున్నానని ట్వీట్ చేశారు. 1962లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 37వేల చదరపు కిలో మీటర్ల ఆక్సాయి చిన్‌ భూభాగాన్ని, 2008 యూపీఏ హయాంలో చుమూర్‌లోని టియా పాంగ్‌నాక్‌, ఛాబ్జి వ్యాలీ ప్రాంతాలను ఆక్రమించిందని గుర్తు చేశారు. అదే ఏడాది దెమ్‌చోక్‌లోని జోరావర్ పోర్టును పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీ నాశనం చేసిందని  తెలిపారు. ఈ సంఘటనలు కాంగ్రెస్‌ హయాంలోనే జరిగాయని కౌంటర్‌ ఇచ్చారు సెరింగ్‌.

 

మరోవైపు...ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు పుల్‌ స్టాప్ పెడుతూ... చైనా, భారత్‌ ఆర్మీ వెనక్కి వెళ్లాయి. సరిహద్దు సమస్యపై సంప్రదింపులు జరుపుతున్నామని చైనా ప్రకటించింది. ఐతే నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన 10వేల బలగాలను పీపుల్స్‌ లిబరేషన్‌ వెనక్కి తీసుకున్నప్పుడే ప్రతిష్టంభన పూర్తిగా తొలిగిపోతుందని భారత్‌ తేల్చి చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: