లాక్ డౌన్ సమయంలోనూ.. ఏపీలో రాజకీయాలు అన్ లాక్ కావడం లేదు. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అదే సమయంలో.. ట్విట్టర్ వేదికగా కూడా ప్రత్యక్ష యుద్ధానికి దిగుతున్నారు. విజయసాయిరెడ్డి, రామ్మోహన్ నాయుడు మధ్య జరిగిన ట్విట్టర్ వార్.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

 

టీడీపీపై వరుస సెటైర్లు వేస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. మరోసారి ట్వీట్ చేశారు. ''కొడుకేమో 'తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు' అనే సామెతతో మొదలుపెట్టి.. టీడీపీలో సీనియర్లంతా చేతులెత్తేశారని.. ఎవరైతే ఏంటని 32 ఏళ్ల రామ్మోహన్‌కు ముళ్ల కిరీటం తగిలిస్తున్నాడు బాబు గారు.. అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. రాజధాని కాకుండా విశాఖను అడ్డుకోజూసి నవ్వుల పాలయ్యాడని.. ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలని అమాయకుడిని బలి పీఠం ఎక్కిస్తున్నాడు.'' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

 

విజయసాయిరెడ్డి ట్వీట్‌పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అదే స్థాయిలో కౌంటర్ ట్వీట్ చేశారు. ''అల్లుడేమో అవినీతికి తిమ్మరాజు పనికి పోతురాజు. సీనియర్లు అందరూ చేతగానోడి పాలన చూసి ''ఛీ'' కొడుతున్నారు. కారు దించేశారనే కక్షతో మామ అప్రూవర్ గా మారి అల్లుడిని కుర్చీ నుంచి దించేయాలని కుట్ర మొదలెట్టాడు. ప్రత్యేక హోదాపై చేతులెత్తేశారు, ఉత్తరాంధ్ర రైల్వే జోన్ పట్టాలెక్కించడం చేతకాలేదు. మూడుముక్కలాట మొదలెట్టి మూతి ముడుచుకొని కూర్చోవడం తప్ప ఏడాదిలో మామ, అల్లుడి వలన ఏ ప్రాంతానికి ఒరిగింది ఏమి లేదు. ఢిల్లీలో కాళ్లు మొక్కడం, ట్విట్టర్ లో రెచ్చిపోవడం మాని రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ లో కృషి చేస్తే ప్రజలు హర్షిస్తారు  విజయసాయిరెడ్డి గారు.'' అంటూ రామ్మోహన్ ఘాటుగానే జవాబిచ్చారు. జగన్‌, విజయసాయిని మామఅల్లుళ్లలా ప్రస్తావిస్తూ.. ట్వీట్ చేశారు రామ్మోహన్ నాయుడు. ఏపీలో అధికార, విపక్షాల నేతలు.. మాటల తూటాలు పేలుస్తుంటే.. ఎంపీలు ట్విట్టర్ లో ఎటాక్ కు కౌంటర్ అటాక్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: