ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌ను ఈ నెల 16 నుంచి నిర్వ‌హించాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్టుగా ఆదిలో వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ఇప్పుడు వీటిపై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. దీనికి కార‌ణం.. రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌డ‌మే కార‌ణ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. స‌భ‌ల‌ను నిర్వ‌హించ‌డం ద్వారా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ఉంటుంది. దీనిపై చ‌ర్చ ఉంటుంది. అదేస‌మయం లో వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టాల్సి కూడా ఉంది. దీనిపైనా చ‌ర్చ జ‌రుగుతుంది. ఫ‌లితంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాను ఈ ఏడాదిలో సాదించి న విజ‌యాల‌ను అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌జ‌ల‌కు గ‌వ‌ర్న‌ర్‌తో చెప్పించాల‌ని భావిస్తున్న‌ది.

 

నిజానికి ఏ ప్ర‌భుత్వానికైనా ఇది అడ్వాంటేజ్‌. తన విజ‌యాల‌ను చెప్పుకొనేందుకు అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు అసెంబ్లీని వేదిక‌గా చేసుకుంటాయి. ఇప్పుడు ఇదే పంథాలో జ‌గ‌న్ కూడా తాను అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో త‌న ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కాలు, సాధించిన విజ‌యాల‌ను ఏక‌రువు పెట్టుకునేందుకు అవ‌కాశం వ‌చ్చినట్టు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ నెల‌లో స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు. అయితే, క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్న నేప‌థ్యం లో స‌భల నిర్వ‌హ‌ణ‌పై సందేహాలు ముసురుకున్నాయి. అదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా స‌భ‌ల‌ను వాయిదా వేయాల‌ని కోరుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

 

నేరుగా రేపో.. మాపో... గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి.. టీడీపీ ఈమేర‌కు విజ్ఞ‌ప్తి చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. క‌రోనాను బూచిగా చూపించి.. చంద్ర‌బాబు స‌భ‌ల నుంచి ఎస్కేప్ అవుతున్నారా? అనే సందేహం వ‌స్తోంది. వాస్త‌వంగా ఇప్పుడు టీడీపీ ప‌రిస్థితి బాగోలేదు. ఈ నేప‌థ్యంలోనే బాబు ఇలా వాయిదా కోరుతున్నార‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. ఇక‌, ప్ర‌భుత్వ ప‌రంగా కూడా క‌రోనా నేప‌థ్యం లో వాయిదా వేయ‌డ‌మే బెట‌ర‌నే వాద‌న వ‌స్తోంది. మొత్తంగా చూస్తే.. స‌భల నిర్వ‌హ‌ణ అనేది క‌ష్ట‌మ‌ని అధికారులు కూడా చెబుతున్న‌ట్టు తెలుస్తోంది. స‌చివాల‌యంలోనూ క‌రోనా కేసులు న‌మోదు కావ‌డం, ఉద్యోగులకు కూడా కొవిడ్ సంక్ర‌మించ‌డంతో స‌భ‌ల నిర్వ‌హ‌ణ ఉంటుందా? ఉండ‌దా? అనేది సందేహంగానే ఉండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: