ఈఎస్‌ఐ స్కామ్‌ విచారణలో భాగంగా ఏసీబీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్టు చేసింది. ఏసీబీ అధికారులు శనివారం ఉదయం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి బస్సుల్లో శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వెళ్లిన పోలీసులు, ఏసీబీ అధికారులు తెల్లవారుజామున ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయన్ను విజయవాడ తీసుకొచ్చారు.

 

 

అసలు అచ్చెన్నాయుడిని ఎందుకు అరెస్టు చేశారు.. ఈ కేసు పూర్వాపరాలేంటనే అంశంపై విజయవాడలోని ఏసీబీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఉదయం 10 గంటలకు ఏసీబీ విశాఖపట్నం అడిషనల్ ఎస్పీ షకీలా భాను ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఆయన పూర్తి సమాచారం అందించే అవకాశం ఉంది. అయితే అచ్చెన్నాయుడి అరెస్టు సమయంలో అరెస్టు సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఏసీబీ అధికారులు అందజేశారు. అయితే.. ఈ అంశాన్ని రాజకీయం చేయదలచుకున్నారో ఏమో కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మరో కొత్త డ్రామాకు తెరతీసినట్టు కనిపిస్తోంది.

 

మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ప్రభుత్వం కిడ్నాప్ చేసిందని ప్రతిపక్షనేత చంద్రబాబు అంటున్నారు. కనీసం ముందస్తు నోటీసు కూడా లేకుండా వంద మంది పోలీసులు ఆయన ఇంటిపై దాడి చేసి వంద మంది పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసి అచ్చెన్నాయుడుని ఎత్తుకెళ్లారు అని చెబుతున్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అచ్చెన్నాయుడు ను అక్రమంగా తీసుకెళ్లడం అప్రజాస్వామికం అంటున్నారు. ఈ కిడ్నాప్ కు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు.

 

 

అచ్చెన్నాయుడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో.. డిజిపి సమాధానం చెప్పాలని... హోంమంత్రి రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కనీసం ఎలాంటి నోటీసు కూడా లేకుండా ఆయన తీసుకెళ్లారని... కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడుకునే అవకాశం కూడా ఇవ్వలేదని చంద్రబాబు అంటున్నారు. తాను ఫోన్ చేసిన అచ్చెన్నాయుడు అందుబాటులోకి రాలేదని చంద్రబాబు అన్నారు. మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ప్రభుత్వం కావాలనే ఆయనను అరెస్టు చేసిందంటున్నారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: