కరోనా బాధితుల్ని పశువుల కంటే హీనంగా చూస్తున్నారని సుప్రీంకోర్టు మండిపడింది. ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్ లో ఆస్పత్రుల నిర్వహణ బాగాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు సరిగా జరగడం లేదని ఎత్తిచూపిన సుప్రీంకోర్టు.. టెస్టులు ఎందుకు తగ్గించారని ఢిల్లీ ప్రభుత్వాన్ని నిలదీసింది. 

 

కరోనా బాధితులకు చికిత్స, కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియల విషయంలో ప్రభుత్వాల తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కరోనా బాధితులకు చికిత్సపై కేంద్ర మాజీ మంత్రి అశ్వినీకుకమార్ రాసిన లేఖపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. మీడియా రిపోర్టుల్ని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహం చెత్తకుప్పలో దొరకడం, మరో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా పూడ్చిపెట్టడం వంటి ఘటనల్ని ఎత్తిచూపింది. దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించింది. 

 

ఢిల్లీతో పాటు మహరాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్ లో కరోనా బాధితులకు చికిత్స జరుగుతున్న తీరుని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఆస్పత్రుల నిర్వహణ ఏ మాత్రం బాగాలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీలో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆస్పత్రిలో కరోనా బాధితులు చికిత్స కోసం లాబీల్లో ఎందుకు నిరీక్షించాల్సి వచ్చిందని ప్రశ్నించింది. 

 

ఆస్పత్రుల్లో కోవిడ్ మృతదేహాల నిర్వహణ కూడా దారుణంగా ఉందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా అంత్యక్రియలు చేయడాన్ని తప్పుబట్టింది. మరికొన్ని ఘటనల్లో మృతదేహాలకు ఉండే గౌరవప్రదమైన అంత్యక్రియల హక్కుని కూడా నిరాకరిస్తున్నారని మండిపడింది. 

 

ఢిల్లీలో కరోనా పరీక్షల సంఖ్య తగ్గడంపై కూడా సుప్రీం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా పరీక్షల సంఖ్య 7 వేల నుంచి ఐదు వేలకు పడిపోయిందని, అలా ఎందుకు తగ్గిందో చెప్పాలని ప్రశ్నించింది. మే నెలతో పోలిస్తే జూన్ నెలలో పరీక్షల సంఖ్య ఎందుకు తగ్గించారో చెప్పాలని ఢిల్లీ సర్కారుని నిలదీసింది. కరోనా విషయంలో కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలను ఢిల్లీ ఆస్పత్రులు పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. 

 

కోవిడ్ సంబంధిత వ్యవహారాల్లో సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని విచారిస్తున్న కేసుల్లో ఇది మూడోది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా ఇబ్బందిపడుతున్న వలస కూలీలపై సుమోటోగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. వారిని స్వస్థలాలకు చేర్చాలని, స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆదేశించింది. ఇప్పుడు ఆస్పత్రుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. నాలుగు రాష్ట్ర ప్రభుత్వాల్ని నివేదికలు కోరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: