తెలంగాణ ప్ర‌భుత్వానికి గ‌త కొద్దికాలంగా పెద్ద త‌ల‌నొప్పిగా మారిన మిడ‌త‌ల దండు విష‌యంలో పెద్ద రిలీఫ్ ద‌క్కింది. మ‌హారాష్ట్ర‌లోని రాంటెక్‌కు వ‌చ్చిన మిడతల గుంపు నుంచి తెలంగాణ‌కు ముప్పు ఉంద‌నే అంచ‌నాలు వెలువ‌డ్డాయి. అయితే, ఆ ముప్పు త‌ప్పింది. రాంటెక్ నుంచి ఆ మిడ‌త‌ల దండు మధ్యప్రదేశ్‌ రాష్ట్రం వైపు వెళ్లింది.

 

రాంటెక్ ప్రాంతానికి  వ‌చ్చిన మిడ‌త‌లు దక్షిణం వైపు ప్రయాణించి తెలంగాణలో ప్రవేశిస్తాయేమోన‌నే అంచ‌నాతో తెలంగాణ ప్ర‌భుత్వం సరిహద్దు జిల్లాల అధికార‌ యంత్రాంగాల‌ను అప్రమత్తం చేసింది.  గురువారం వాతావరణం అనుకూలించకపోవ‌డంతో అధికారులు హెలికాప్టర్‌లో రాష్ట్ర సరిహద్దులను పర్య‌వేక్షించ‌లేక‌పోయారు. అయితే, స‌మ‌యంలో అవి వ్యతిరేక దిశలో మధ్యప్రదేశ్‌ దిశగా సాగుతుండటంతో తెలంగాణ సరిహద్దు గ్రామాలకు తాత్కాలికంగా ముప్పు తప్పింది. అయితే అవి ఏ సమయంలో ఎటువైపు తిరుగుతాయో తెలియద‌ని, అందుకే నిఘా కొన‌సాగిస్తున్నామ‌ని తెలంగాణ అధికారులు తెలిపారు.  ఉత్త‌ర ‌దిశ‌గా 60 కిలోమీటర్ల దూరం ప్ర‌యాణించి మెహాడీ అనే గ్రామంలో అవి ఆగాయ‌ని మహారాష్ట్ర అధికారులు తెలిపారు.

 

కాగా, తెలంగాణ‌కు పొరుగు రాష్ట్రాలైన మ‌హారాష్ట్ర, చ‌త్తీస్‌ఘ‌డ్‌లోకి ఈ మిడ‌తల దండు ప్ర‌వేశించిన నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న నిజామాబాద్‌, కామారెడ్డి, అసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలకు వీటితో ప్రమాదం పొంచి ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ కమిషనర్‌ బీ జనార్దన్‌రెడ్డి  అధికారులను ఆదేశించారు. మిడతల దండు కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సమస్యపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సరిహద్దు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో నిఘా బృందాలు, గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి మిడతల దండుతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. సీఎం కేసీఆర్ వీటిపై ఆయా జిల్లాల‌కు చెందిన క‌లెక్ట‌ర్ల‌తో ప్ర‌త్యేక క‌మిటీ సైతం వేశారు. తాజా ప‌రిస్థితుల్లో తెలంగాణ ప్ర‌భుత్వ అధికారుల టీం క్రియాశీలంగా ప‌నిచేయాల్సి ఉంది. ఈ నెల 20 తర్వాత మిడతలు మళ్లీ వచ్చే అవకాశముందన్న అంచ‌నాల మేర‌కు వాటిని నియంత్రించ‌డం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటోం‌ది. 

మరింత సమాచారం తెలుసుకోండి: