తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీ. ఆ పార్టీ ఒక్క రోజులో నిర్మితం కాలేదు. అలాగే ఒక్క రోజుతో పోయేది కాదు. అయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇపుడు టీడీపీ నానారకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. టీడీపీ బలహీనమైన స్థితిలో ఇపుడు ఉందంటున్నారు.

 

పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ముగ్గురు బయటకు వెళ్ళారు. ఇక మిగిలిన వారు కూడా అదే బాట పడతారా అన్న చర్చ సాగుతోంది. నిజానికి తన పార్టీలో ఉండేదెవరు, పోయేదెవరు అన్నది తెలుసుకోవడానికే చంద్రబాబు తెలివిగా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ పెట్టించారు అంటున్నారు. 

 

ఆయన ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్యను అయిదవ అభ్యర్ధిగా నిలబెట్టారు. ప్రతీ ఎమ్మెల్యే ఓటు వేయాలి. అసెంబ్లీలో టీడీపీకి సాంకేతికంగా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ముగ్గురు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. వారే వల్లభనేని వంశీ. కరణం బలరాం, మద్దాల గిరి. ఈ ముగ్గురూ విప్ జారీ చేస్తే టీడీపీ అభ్యర్ధికి అనుకూలంగా ఓటు చేయాలి.

 

అదే విధంగా మిగిలిన వారు కూడా ఓటు చేయాలి. కాదని ధిక్కరిస్తే మాత్రం విప్ ని ఖాతరు చేయనందుకు  వారి ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయాలని టీడీపీ స్పీకర్ ని కోరాల్సివుంటుంది. స్పీకర్ కనుక ఓకే అంటే వారి మెంబర్ షిప్ రద్దు అవుతుంది. అపుడు ఉప ఎన్నికలు వస్తాయి. అయితే ఇపుడున్న ప్రకారం చూసుకుంటే టీడీపీ విప్ జారీ వరకూ ఓకే కానీ ఒకవేళ  విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేల  మీద చర్యలు కోరి ఉప ఎన్నికల వరకూ కధను నడుపుతుందా అన్నది చర్చగా ఉంది.

 

గతంలో విప్ ని ధిక్కరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వైసీపీ గుర్తు మీద ఉప ఎన్నికల్లో  జగన్ గెలిపించుకున్న చరిత్ర వైసీపీకి ఉంది. అందువల్ల వారు కనుక వైసీపీకి ఓటు వేస్తే వారి సభ్యత్వం రద్దు అయితే వైసీపీకే లాభం అంటున్నారు. వారికి వైసీపీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే అసెంబ్లీలో టీడీపీ బలం బాగా తగ్గుతుంది అంటున్నారు. ఒకవేళ టీడీపీ సైలెంట్ గా ఉంటే వారంతా ధిక్కరించి మరీ తమను శాసనసభలోఒ  వేరుగా గుర్తించమని స్పీకర్ ని కోరే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఏదైనా కూడా టీడీపీకి ఇరకాటమే. మరి ఈ నెల 19న టీడీపీ ఎమ్మెల్యేలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: