అధికారంలో ఉన్న పార్టీలోకి ప్రతిపక్షానికి చెందిన నేతలు, ఎమ్మెల్యేలు జంప్ కొట్టడం సర్వసాధారణమైన విషయమే. గతంలో అధికారంలో టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు నాయకులు చేరారు. ఇక ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో వరుస పెట్టి టీడీపీ నేతలు జగన్‌కు జై కొడుతున్నారు. అయితే ఇక్కడ ఎమ్మెల్యేలని చేర్చుకునే విషయంలో జగన్ ఒక కండిషన్ పెట్టారు. పార్టీలోకి వచ్చేవారు పదవులకు రాజీనామా చేసి రావాలని చెప్పడంతో, టీడీపీ ఎమ్మెల్యేలు జంప్ చేయడానికి ఛాన్స్ రాలేదు.

 

కానీ గన్నవరం వల్లభనేని వంశీ తెలివిగా టీడీపీని వైసీపీలో చేరకుండా జగన్‌కు సపోర్ట్ ఇచ్చారు. అలాగే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి కూడా అలాగే చేశారు. తర్వాత చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్ టీడీపీని వీడారు. అయితే వీరు తెలివిగా పదవి పోకుండా ఇలా చేసిన సరే, ప్రజల్లో మాత్రం పార్టీ మారారనే భావనే ఉంది. ఇప్పుడు నాలుగేళ్ళు బాగానే ఉన్నా తర్వాత మాత్రం వీరికి కాస్త ఇబ్బందికర పరిస్తితి ఉండొచ్చు. ఎందుకంటే పార్టీ మారిన వాళ్ళని ప్రజలు అంగీకరించరని 2019 ఎన్నికలు రుజువు చేశాయి.

 

అయితే ఇక్కడ వల్లభనేని వంశీ, కరణంలకు పెద్ద సమస్య ఉండదని తెలుస్తోంది. ఎందుకంటే వాళ్ళకు పార్టీ ఇమేజ్ కంటే సొంత ఇమేజ్ ఎక్కువగా ఉంది. 2019 ఎన్నికల్లో అలాగే గెలిచారు. కానీ మద్దాలి గిరి మాత్రం అలా కాదు. ఈయన పార్టీ ఇమేజ్‌ ద్వారానే గెలిచారు. ఎందుకంటే గుంటూరు వెస్ట్ టీడీపీకి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 17 వేల మెజారిటీతో గెలిచారు.

 

ఇక 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ గాలి ఉన్నా సరే గిరి 5 వేల మెజారిటీతో వైసీపీ అభ్యర్ధి చంద్రగిరి యేసురత్నంని ఓడించారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఈయన వైసీపీ టిక్కెట్ ద్వారా పోటీ చేస్తే విజయం దక్కడం అంత సులువు కాదని తెలుస్తోంది. మొత్తానికైతే భవిష్యత్‌లో మద్దాలి గిరికి కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: