కరోనా వైరస్ బాధితులను పశువుల కంటే హీనంగా చూస్తున్నారు అని సుప్రీంకోర్టు మండిపడింది. ఢిల్లీతో పాటు మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ తమిళనాడు ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ సరైన రీతిలో లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ తో చనిపోయిన వారి అంత్యక్రియలు సరిగా జరగడం లేదని ఎత్తిచూపిన సుప్రీంకోర్టు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ఎందుకు తగ్గించారని ఢిల్లీ సర్కార్ ని నిలదీసింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితులకు చికిత్స మరియు అంత్యక్రియల విషయంలో ప్రభుత్వాల తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. కరోనా బాధితులకు చికిత్స పై కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ రాసిన లేఖ పై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మీడియా రిపోర్టులను ప్రస్తావిస్తూ ప్రభుత్వాలపై ప్రశ్నల వర్షం కురిపించింది.

 

కరోనా వైరస్ ఎఫెక్ట్ తో చనిపోయిన వ్యక్తి మృతదేహం చెత్తబుట్టలో దొరకడం, మరో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా పూడ్చి పెట్టడం వంటి ఘటనలను ఎత్తిచూపింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రభుత్వాలను ప్రశ్నించింది. ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ లో కరోనా బాధితులకు చికిత్స జరుగుతున్న తీరును సుప్రీం కోర్ట్ ఆక్షేపించింది. హాస్పిటల్ నిర్వహణ ఏమాత్రం బాగాలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.

 

ఢిల్లీలో లోక్ నాయక్ జయప్రకాష్ హాస్పిటల్ లో కరోనా బాధితులు చికిత్స కోసం లాబీలో ఎందుకు నిరీక్షించాల్సి వచ్చిందని ప్రశ్నించింది. హాస్పిటల్ లో కరోనా వ్యక్తి మృతదేహం పట్ల హాస్పిటల్ సిబ్బంది ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని స్పందించకుండా అంత్యక్రియలు చేయడాన్ని తీవ్ర స్థాయిలో ఖండించింది. ఢిల్లీ లో గత నెలతో పోలిస్తే జూన్ మాసంలో కరోనా వైరస్ పరీక్షలు సంఖ్య ఎందుకు తగ్గిందని ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు నిలదీసింది. కరోనా వైరస్ విషయంలో కేంద్ర హోంశాఖ ఆదేశాలను ఢిల్లీ హాస్పిటల్స్ పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా 4 రాష్ట్ర ప్రభుత్వాలను ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు నివేదికలను సుప్రీంకోర్టు కోరింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: