మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈఎస్ఐ కుంభకోణంలో ఏ2గా ఉన్న అచ్చెన్నాయుడు అనారోగ్యంతో బాధ పడుతూ ఉండటంతో ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని కోర్టు ఆదేశించింది. అధికారులు మొదట విజయవాడ సబ్ జైలుకు తరలించి అనంతరం జైలు అధికారుల అనుమతితో జీజీహెచ్ కు తరలించారు. 
 
ఏసీబీ న్యాయమూర్తి ఈఎస్ఐ కుంభకోణంలో ఏ1గా ఉన్న మాజీ ఈఎస్ఐ డైరెక్టర్ రమేశ్ కుమార్ కు కూడా రెండు వారాల రిమాండ్ విధించారు. అధికారులు రమేష్ కుమార్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం 7.10 గంటలకు అచ్చెన్నాయుడి ఇంట్లోకి వెళ్లిన ఏసీబీ బృందాలు 7.20 గంటలకు ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. 
 
రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈఎస్ఐ కుంభకోణంపై విచారణ మొదలైంది. 2017, 2018 సంవత్సరాల్లో ఐ.ఎం.ఎస్ డైరెక్టర్ గా పని చేసిన రమేష్ కుమార్ అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు అందటంతో విజిలెన్స్ కమిషన్ ఆ ఫిర్యాదుల గురించి విచారణ చేసి నివేదిక సిద్ధం చేసింది. అనంతరం రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఏపీ ఏసీబీ దాదాపు 150 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. 
 
మందులు, ల్యాబ్ కిట్లు, ఫర్నిచర్ ను మార్కెట్ ధర కంటే 50 నుంచి 130 శాతం అధిక ధరకు కొనుగోలు చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడాన్ని టీడీపీ బీసీలపై దాడిగా చెబుతోంది. టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ నేతలు స్పందించారు. అచ్చెన్నాయుడు 150 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డాడని.... బీసీలపై దాడిగా టీడీపీ ప్రచారం చేయటాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు.      

మరింత సమాచారం తెలుసుకోండి: