కరోనా.. ప్రజల జీవితాల్లో పెనుమార్పు తీసుకొచ్చింది. మొన్నటివరకు హోటల్స్ లో తిని, మాల్స్ లో షాపింగ్ చేసి ఎంజాయ్ చేసినవాళ్లు.. ఇప్పుడు వాటివైపు చూడటమే మానేశారు. భయం..అనేది ఇప్పుడు జీవితంలో భాగమైపోయింది. ఎవరి నుంచి ఎలా వైరస్ వ్యాపిస్తుందో అని బిక్కుబిక్కుమంటూ గడిపేస్తున్నారు.

 

కరోనా.. ఇప్పుడు ఈ పేరు వినిపిస్తేనే భయం. ఈ వైరస్ వల్ల వచ్చే రోగం కంటే..అది చూపిస్తున్న ప్రభావం.. చాలా ఎక్కువగా ఉంది. కరోనా ఎంత మందిని చంపుతుందో తెలియదు కాని, ఓ విధమైన భయాన్ని మాత్రం అందరిలోనూ నింపగలిగింది. ప్రతి ఒక్కరిలో భావోద్వేగమైన నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయి. ఏ పని చేస్తున్నా.. భయం మాత్రం వదిలిపెట్టడం లేదు. ఎవరి చేయి తగిలితే ఏం జరుగుతుందో, దేనిపై చేయి వేస్తే.. ఎక్కడ కరోనా వస్తుందో అనే భయం జనాన్ని వెంటాడుతోంది. అసలు ఏ రూపంలో వస్తుందో అని వణికిపోతున్న వాళ్లూ ఉన్నారు.

 

కరోనా వైరస్.. మొత్తం జీవనవిధానాన్నే మార్చేసింది. మొన్నటివరకూ ఇష్టమైన హోటల్స్ లో తిని.. హ్యాపీగా షాపింగ్ చేసినవాళ్లు.. ఇప్పుడు ఇంటి గడప దాటాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. పైకి ధైర్యంగా ఉంటున్నట్లు కనిపిస్తున్నా.. భయం ఇప్పుడు చాలా మంది జీవితంలో భాగం అయిపోయింది. హోటల్స్ కి జనం వెళ్లడం లేదు. హోటల్స్ కి వెళ్లాలని ఎంత కోరికగా ఉన్నా.. ఇప్పుడు  అంత రిస్క్ తీసుకోవడం  అని కంట్రోల్ చేసుకుంటున్నారు. ఒక్కపూట జిహ్వచాపల్యం కోసం చూసుకుంటే.. మహమ్మారి ఎక్కడ వెంటపడుతుందో అని జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పుడు ఈ అవుట్ సైడ్ ఫుడ్ అవసరమా అని బతుకు బండిని లాగించేస్తున్నారు. ఉద్యోగరిత్యానో, గత్యంతరం లేకపోతే తప్ప.. హోటల్స్ వైపు చూడటం లేదు. అంతగా ప్రజల్ని భయపెట్టేసింది ఈ సూక్ష్మజీవి.

 

చాలా కుటుంబాల్లో షాపింగ్ ఊసే వినిపించడం లేదు. అవి తెరిచారే కానీ.. వాటి ముఖం చూసే వాళ్లే కనిపించడం లేదు. లిఫ్ట్ లు ఎక్కేవాళ్లు.. చేతి వేళ్లతో బటన్స్ నొక్కడం మరిచిపోయారు. ఇక సానిటైజర్స్ జీవితంలో భాగం అయిపోయాయి. అదేదో సినిమాలో చెప్పిన్నట్లు.. వైరస్ రాకముందు ఒక లెక్కా.. ఇప్పుడు మరో లెక్కా.. అన్నట్టు మారిపోయాయి జీవితాలు. షేక్ హ్యాండ్ సంస్కృతి పూర్తిగా ఆగిపోయింది. కిందిస్థాయి జనం మార్కెట్లకు, చికెన్ షాపులకి ఎగబడుతున్నా.. ఎక్కువమంది మాత్రం ఊరికే షాపులపై వెళ్లిపడిపోవడం లేదు. ఇక స్వీట్ షాపులు, బేకరీల్లో ఎవరైనా అడుగుపెడితే ఒట్టు.

 

ఇక మొన్నటివరకు బస్సులు తిరగడం లేదని అనుకున్నారు. ఇప్పుడు  బస్సులు తిరగడం ప్రారంభమైనా.. వాటిలో ప్రయాణించే వారి సంఖ్య అంతంతమాత్రమే. అత్యవసరమైతే తప్ప.. ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవడంలేదు. దీంతో ఆర్టీసీ భారీ నష్టాల్లో కూరుకుపోతోంది. ఇంట్లో నుంచి బయటకు అడుగుపెడితే.. ఎక్కడ నుంచి వైరస్ అంటుకుంటుందో అన్న భయం వెంటాడుతోంది. ఆఖరికి చిన్న చిన్న జబ్బులకి హాస్పిటల్స్ కి కూడా పోవడం లేదు. అంతలా కరోనాకి భయపడుతున్నారు జనం. 

 

ఇక ఫంక్షన్లు, పార్టీలు అంటే ఆమడ దూరం జరిగిపోతున్నారు. పెళ్లిళ్లూ కూడా సింపిల్ గా కానిచ్చేస్తున్నారు. ఫంక్షన్లు భారీగా చేయాలని ఎంత ఆశ ఉన్నా.. వైరస్ దెబ్బకి దగ్గరి బంధువుల సమక్షంలలో తూతూమంత్రంగా అలా ముగించేస్తున్నారు. పని చేసే ఆఫీసుల్లోనూ, ఇతర వర్క్ ప్లేసెస్ లోనూ.. ఇతరులతో మెలిగే పద్ధతి మారిపోతోంది.  గతంలోలా పక్కన పక్కన కూర్చోవడం, కబుర్లు చెప్పుకోవడం తగ్గిపోతోంది. ఎవరితో మాట్లాడాలన్నా.. కాస్త చనువుగా ఉండాలన్నా.. లోలోపల భయం వెంటాడుతోంది. ప్రతి ఒక్కరినీ అనుమానంతో చూడటం.. పరిపాటిగా మారింది.

 

ప్రజల జీవనవిధానాల్ని ఇంతలా మార్చేసింది ఒకే ఒక్క వైరస్. అది అంత ప్రాణాంతకం కాకపోయినా.. దానివల్ల ఏర్పడిన ఫోబియా.. ప్రజలకు కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. వైరస్ భయం నీడలా వెంటాడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: