తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత‌, మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌దైన శైలిలో కామెంట్లు చేయ‌డం ద్వారా వార్త‌ల్లో నిలిచే రేవంత్ రెడ్డి తాజాగా మ‌రోమారు దుమారం రేపే మాట‌లు మాట్లాడారు. జర్నలిస్టుల ఉపవాస దీక్షకు మద్దతు తెలిపిన రేవంత్ రెడ్డి జర్నలిస్టుల సహాయ నిధికి 2 లక్షల రూపాయలు చెక్‌ను అందజేశారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విధి లేని పరిస్థితిలో జర్నలిస్టులు ముందుకు వస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జ‌ర్న‌లిస్టులు ఉపవాస దీక్ష చేస్తున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందనే అర్థం చేసుకోవాల‌న్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


15 వేల కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ‌ ప్రభుత్వానికి పెరిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్ర‌తి ఒక్క‌ కరోనా పేషంట్‌కు  3.5 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు చెప్తున్న ప్రభుత్వం.. ఇటీవ‌ల మృతి చెందిన మనోజ్ కోసం ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు 50 వేల టెస్టులు చేయలేదని, దీన్ని బట్టే క‌రోనా విష‌యంలో ప్ర‌భుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలుస్తోందని ఆయ‌న విమ‌ర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకు కరోనా వస్తే.. యశోదా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు కానీ గాంధీ ఆస్ప‌త్రిలో చికిత్స పొంద‌డం లేద‌ని రేవంత్ రెడ్డి త‌ప్పుప‌ట్టారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్‌ను వచ్చే వారం మంత్రి పదవి నుండి తొలగిస్తున్నారని అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పరిస్థితిని తీసుకువచ్చారని రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కాగా, రేవంత్ చేసిన ఈ కామెంట్లు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గా్ల‌లో మ‌రోమారు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. క‌రోనా క‌ల‌క‌లం మొద‌లైన నాటి నుంచి మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ముందుండి క్రియాశీలంగా తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌ఫున విశేష కృషి చేస్తున్నారు. అలాంటి త‌రుణంలో ఆయ‌న్ను తొల‌గించేందుకు అడుగులు ప‌డుతున్నాయ‌నే వార్త‌లు రావ‌డం స‌హ‌జంగానే చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అయితే, రేవంత్ ఉద్దేశ‌పూర్వ‌కంగానే ప‌లు కామెంట్లు చేస్తుంటార‌ని...దీన్ని సీరియ‌స్‌గా తీసుకోన‌క్క‌ర్లేద‌ని టీఆర్ఎస్ వ‌ర్గాలు కామెంట్లు చేస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: