దేశంలో కరోనా రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 11 వేల 458 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో బాధితుల సంఖ్య 3 లక్షల 8 వేలు దాటింది.

 

దేశంలో కరోనా ఉధృతి రోజురోజుకీ పెరుగుతోంది. మొత్తం బాధితుల సంఖ్య 3 లక్షల 8 వేల 993కి చేరింది. కొత్తగా 11 వేల 458 మంది వైరస్ సోకడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వీరిలో లక్ష 45 వేల 779 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. లక్ష 54 వేల 329 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు.  కొత్తగా 386 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 8 వేల 884కు పెరిగింది. మరోవైపు దేశంలో రికవరీ రేటు 49.94 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. 

 

బిహార్‌, ఛత్తీస్‌గడ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ-కశ్మీర్‌, ఝార్ఖండ్‌, కర్ణాటక, మేఘాలయ, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో కొత్త కేసుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. ఇక అత్యధిక కేసులతో విలవిల్లాడుతున్న మహారాష్ట్రలో ఇప్పటి వరకు లక్ష ఒక వెయ్యి 141 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. తమిళనాడు 40 వేల 698, ఢిల్లీ 36 వేల 824 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

 

ఇక ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 4 లక్షల 25 వేలు దాటింది. తీవ్రత ఎక్కువగా ఉన్న బ్రెజిల్‌ మరణాల సంఖ్యలో బ్రిటన్‌ను దాటింది. ఇప్పటి వరకు అక్కడ 42 వేల మందికి పైగా మృతిచెందారు. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన తొలి పది దేశాల జాబితాలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. అమెరికా, బ్రెజిల్‌, రష్యా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

 

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరడానికి.. 134 రోజుల సమయం పట్టింది. అమెరికాలో 3 లక్షల కరోనా కేసులు నమోదు కావడానికి కేవలం 73 రోజులే పట్టింది. బ్రెజిల్‌ 85, రష్యా 109 రోజుల్లో 3 లక్షల మైలురాయిని దాటాయి. అయితే ఈ మూడు దేశాల మొత్తం జనాభా.. భారతదేశ జనాభాలో దాదాపు సగమే మాత్రమే. భారత్‌తో పోల్చుకుంటే అమెరికా, బ్రెజిల్, రష్యాలు అత్యధికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాయి. టాప్‌-10 కరోనా బాధిత దేశాల్లో ప్రతి 10 లక్షల మంది జనాభాకు జరుగుతున్న కోవిడ్‌ పరీక్షలను పరిశీలిస్తే భారత్‌ చాలా వెనుకబడి ఉంది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం సమాచారం ప్రకారం పది లక్షల జనాభాకు కరోనా పరీక్షల ఆల్-టైమ్ సగటు ఒకటి మాత్రమే. ప్రస్తుతం దేశంలో రోజుకు 1.5 లక్షల పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

 

జనవరి 30న భారత్‌ మొదటి కరోనా కేసు వెలుగులోకి రాగా, మే 18 నాటికి లక్ష మార్క్‌ చేరుకుంది. అంటే 109 రోజుల సమయం పట్టింది. తర్వాత రెండు వారాలకే కోవిడ్‌ కేసులు 2 లక్షలు దాటేశాయి. అక్కడి నుంచి 3 లక్షల మార్క్‌ను చేరడానికి  కేవలం 10 రోజులు మాత్రమే పట్టిందంటే కరోనా విజృంభణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. లాక్‌డౌన్‌ సడలించినప్పటి నుంచి రోజుకు 8 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే భారత్‌ కంటే ముందున్న మూడు దేశాలతో పోల్చుకుంటే పరిస్థితి మెరుగ్గానే అనిపిస్తోంది. అయితే ఇప్పుడే భారత్‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు రెట్టింపయ్యే వ్యవధి పెరుగుతుండటం ఊరట కలిగిస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు రెట్టింపయ్యే వ్యవధి వారం క్రితం 15.4 రోజులు కాగా, ప్రస్తుతం అది 17.4 రోజులుగా నమోదయిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: