అదేంటో తెలుగుదేశం పార్టీలో గందరగోళం చాలా ఉంది.  ఎవరేం మాట్లాడుతున్నారో కూడా అర్ధం కావడంలేదు. ఓ వైపు జగన్ దూకుడుగా మీదమీదకు వస్తూంటే పూర్తి డిఫెన్స్ లో పడిన పచ్చ పార్టీ తమ్ముళ్లకు  సరైన మాటలు కూడా రావడంలేదులా ఉంది. అందుకే ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడుతూ మరిన్ని కొత్త రాజకీయ  ప్రమాదాలను కోరి మరీ  తెచ్చుకుంటున్నారు.

 

ఎరగని వారికి ఎత్తులు అన్నట్లుగా జగన్ కి కొత్త విషయాలు చెప్పేస్తున్నారు. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకరెడ్డిది పెద్ద నోరు. ఆయన మీడియా ముందుకు వస్తే మాములుగానే ఏం మాట్లాడుతారో ఎవరికీ తెలియదు. ఇపుడూ ఆయన తన సొంత తమ్ముడు జేసీ ప్రభాకరరెడ్డి అరెస్ట్ కావడంతో మంచి కాక మీద ఉన్నారు. దాంతో ఆయన జగన్ మీద బాగానే విరుచుకుపడ్డారు. పడిపడి జగన్ని తిట్టిపోసారు. అంతే కాదు, జగన్ చంద్రబాబు మీదకు రాలేక మామీదకు వస్తున్నారని కూడా ఆడిపోసుకున్నారు. బాబు జోలికి వస్తే భస్మీపటలమేనని కూడా జేసీ అంటున్నారు.

 


ఓ విధంగా ఇది జగన్ కి హెచ్చరికగా కాదు, కవ్వింపుగా ఉందని అంటున్నారు. అసలే జగన్ ఓటమిని అంగీకరించని మనిషి అంటారు. ఆయన సీబీఐ విచారణ వేసింది, గ్రౌండ్ మొత్తం ప్రిపేర్ చేస్తున్నది కూడా బాబును పద్మవ్యూహంలోకి లాగడానికే అన్నీ తెలిసి కూడా జేసీ మా సంగతేంటి ముందు బాబు సంగతి చూడు అన్నట్లుగా రెచ్చగొట్టడం అంటే బాబు కాళ్ళ కిందకు నీళ్ళు తేవడమే. అసలే  తన కుడిభుజం లాంటి అచ్చెన్నాయుడు అరెస్ట్ తో పాటు టీడీపీ నేతల  వరస అరెస్టులతో బాబు ఇబ్బందులో ఉన్నారు.

 

 

ఇపుడు జేసీ లాంటి వారు ధైర్యం చెప్పి ఏదైనా సలహా ఇవ్వాల్సింది పోయి బాబు జోలికి వస్తావా అంటూ జగన్ కి సవాళ్ళు విసరడం ఏంటని సొంత పార్టీలో చర్చ సాగుతోంది. ఏది ఏమైనా ఏపీలో జగన్ పసందైన రాజకీయానికి తెర తీశారు. ఇందులో ఎవరు ఇరుక్కుంటారో వెయిట్ అండ్ సీ అంటున్నారు వైసీపీ మంత్రులు. అందరూ విచారణకు రావాల్సిందేనని మంత్రి పేర్ని నాని అంటున్నారు కూడా.మరి జేసీకెందుకో ఈ తొందర  అని పచ్చ పార్టీలో వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: