కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు పిలుపు ఇవ్వడం... పోలీసులు ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేయడం. కృష్ణా నది, గోదావరిపై పెండింగ్ ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తామని చెప్పడంతో.. హస్తం పార్టీ నేతల్ని పోలీసులు కట్టడి చేశారు. దీంతో పోలీసుల తీరుపై కాంగ్రెస్ నాయకులంతా ఒకింత గుర్రుగానే ఉన్నారు. త్వరలోనే కోర్టు మెట్లెక్కే ఆలోచనలో ఉంది కాంగ్రెస్.

 

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తలపెట్టిన గోదావరి జలదీక్షకి పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఎక్కడి నాయకులను అక్కడే అరెస్ట్ చేశారు. గౌరవెల్లి రిజర్వాయర్ దగ్గరికి చేరుకున్న ఏఐసీసీ కార్యదర్శి సంపత్ ను పోలీసులు అరెస్ట్ చేసి హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఎంపీ కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ ను హౌస్ అరెస్ట్ చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఖమ్మంలోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. పార్టీ సీనియర్ నాయకుడు హన్మంతరావుని భద్రాచలంలో అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే సీతక్కని ములుగులో గృహ నిర్బంధం చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ తుమ్మిడి హట్టికి వెళ్లాల్సి ఉంది. ఆయన్ని కూడా పోలీసులు ఆపేశారు. అటు మాజీ మంత్రులు శ్రీధర్ బాబు. జీవన్ రెడ్డిలను కూడా ఇంటికే పరిమితం చేశారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీని ఉదయం నుంచి హౌస్ అరెస్ట్ చేశారు. 

 

జల దీక్షలపై ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి కట్టడి చేయలనుకుంటోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ మండిపడ్డారు. పోలీసు అధికారులు ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ప్రోజెక్టుల సందర్శనకు వెళ్తే తప్పేంటని నిలదీశారు.  

 

ప్రభుత్వానికి ప్రాజెక్టులు చూస్తామంటే జంకు ఎందుకు అని ప్రశ్నించారు సీఎల్పీ నేత భట్టి. పోలీసులతో రాజ్యమేలాలని చూస్తున్నారని ఆరోపించారు.

 

పెండింగ్ ప్రాజెక్టులకు రెండు వేల కోట్లు కేటాయిస్తే...3 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేయన్నారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ.  సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కే పథకాలు పరిమితం చేస్తారా..? అని ప్రశ్నించారు. ఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాకు నీళ్లు లేవన్నారు జగ్గారెడ్డి. సొంత జిల్లాకే నీళ్లు ఇవ్వని కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు నీళ్లిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ తలపెట్టిన గోదావరి జలదీక్ష ను పోలీసులు కట్టడి చేశారు. దింతో పోలీసుల తీరుపై లీగల్ గా ఫైట్ చేయడానికి సిద్ధమైంది కాంగ్రెస్.

మరింత సమాచారం తెలుసుకోండి: