దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి 14రోజులు రిమాండ్ విధించారు. నిన్న అచ్చెన్నాయుడి అరెస్ట్ తరుణంలో.. ఏలూరు సమీపంలో కలపర్రు టోల్ గేట్ కు చేరుకున్న చింతమనేనిని.. పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు ఎక్సైజ్ న్యాయమూర్తికి చింతమనేనిని హాజరుపరచడంతో.. ఆయన రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

 

శుక్రవారం అచ్చెన్నాయుడి అరెస్ట్ సందర్భంగా.. ఆందోళనకు దిగిన చింతమనేనిని అరెస్ట్ చేసిన పోలీసులు.. శనివారం న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కోర్టు చింతమనేనికి 14 రోజుల రిమాండ్ విధించింది. అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసి విజయవాడ తీసుకువెళ్తున్నారనే సమాచారంతో చింతమనేని మరో వ్యక్తితో కలసి ఏలూరు సమీపంలోని కలపర్రు టోల్ గేట్ దగ్గరకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు చింతమనేనిని టోల్ గేట్ దగ్గర నిలువరించారు. చింతమనేని టోల్ గేట్ దగ్గరకు వస్తున్నారని తెలియగానే టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా కలపర్రు టోల్ గేట్ వద్దకు చేరుకున్నారు. కరోనా తరుణంలో ఎక్కువ మంది ఒకే చోట ఉండకూడదు అంటూ పోలీసులు చెప్పినా చింతమనేని, అతని అనుచరులు వెళ్లకపోవడంతో పోలీసులు చింతమనేనిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అరెస్ట్ చేస్తున్న పోలీసులను, చింతమనేని, అతని అనుచరులు అడ్డుకోవడంతో నిన్న మధ్యాహ్నం చింతమనేని ప్రభాకర్ సహా మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేసి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 

పోలీసులకు, చింతమనేనికి మధ్య జరిగిన తోపులాటలో చింతమనేని స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అక్రమంగా ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పే వరకు భోజనం కూడా చేయనంటూ దీక్షకు కూర్చున్నారు. కోర్టు నిబంధనల ప్రకారం చింతమనేనికి కోవిడ్ టెస్ట్ చేయకుండా కోర్టులో హాజరుపరచడానికి అవకాశం లేదు. దీదంతో చింతమనేనిని కోవిడ్ టెస్టుకు సహకరించాల్సిందిగా కోరారు. అర్ధరాత్రి వరకు చింతమనేని కోవిడ్ టెస్టుకు సహకరించలేదు. తర్వాత కోవిడ్ టెస్ట్ చేయడంతో నెగిటీవ్ వచ్చింది. దీంతో శనివారం ఉదయం చింతమనేనిని ఏలూరులోని ఎక్సైజ్ న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరు పరిచారు పోలీసులు. చింతమనేని తరపున న్యాయవాది వాదనలు, చింతమనేని చెప్పిన మాటలను విన్న జడ్జి.. 14రోజులు రిమాండ్ విధించారు. వెంటనే చింతమనేనిని ఏలూరులోని జిల్లా జైలుకు తరలించారు. చింతమనేనిది రాజకీయ అరెస్టని టీడీపీ నేతలు విమర్శించారు. 

 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే వరుస కేసుల్లో అరెస్టై.. ఇటీవలే బెయిల్ పై బయటికొచ్చిన చింతమనేని.. మళ్లీ అరెస్ట్ కావడం ఆయన అనుచరుల్లో చర్చనీయాంశంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: