ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల తరచూ చంద్రబాబు పాటే పాడుతున్నారు. చంద్రబాబు తరహాలోనే విమర్శలు చేస్తున్నారు. చివరకు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుకు తోకగా మారాడని వైసీపీ నేతలు ఆ మధ్య చాలా ఘాటుగా విమర్శించారు. విజయసాయిరెడ్డి వంటి వైసీపీ కీలక నేతలు ఈ విషయంలో మరో అడుగు ముందుకేసి కన్నాను బాగానే టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకున్నారు.

 

 

అయితే చాలా రోజుల తర్వాత కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుకు షాక్ ఇచ్చాడు. అచ్చెన్నాయుడు అరెస్టు అక్రమం, బీసీలపై దాడి.. అరాచకం అని చంద్రబాబు మొత్తుకుంటుంటే.. అబ్బే.. దాందే ముంది.. తప్పు చేసిన వారెవరైనా చట్టం ముందు ఒకటే అంటూ జగన్ సర్కారు తీరుకు మద్దతు పలకడం ఆసక్తిరేపుతోంది. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ కొనుగోళ్ల వ్యవహారంలో ఏసీబీ అరెస్ట్ చేయడంపై కన్నా లక్ష్మీనారాయణ ఓ ప్రకటన ద్వారా స్పందించారు.

 

 

అచ్చెన్నాయుడు అవినీతి కేసుల్లో అరెస్ట్ కావడాన్ని బీజేపీ స్వాగతిస్తోందని కన్నా ఆ ప్రకటనలో తెలిపారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, ఎవరు తప్పు చేసినా వారిపై చట్టప్రకారం విచారణ జరగాలని పేర్కొన్నారు. తమ పాలనలో అంతా పారదర్శకంగానే జరిగిందని గొప్పలు చెప్పుకున్న టీడీపీ ఇప్పుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ ను అక్రమమని ఘోషిస్తోందని మండిపడ్డారు. అంతేనా.. అచ్చెన్నాయుడు తప్పు చేయకపోతే భయం ఎందుకు అని కన్నా నిలదీశారు.

 

 

ఇదే సమయంలో కన్నా వైసీపీ సర్కారుపైనా విమర్శలు గుప్పించారు. జగన్ వచ్చాక పెద్ద కుంభకోణాల విషయంలో నోరు మెదపడంలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్నారు, కమిషన్ వేశారు, అయినా ఇప్పటికీ విచారణ జరగలేదని కన్నా ఆరోపించారు. ఇక, పేదలకు ఇళ్ల స్థలాల కొనుగోలు వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, టీడీపీ, వైసీపీల వ్యవహారం దొంగలు ఊళ్లు పంచుకున్నట్టుగా ఉందని కన్నా మండిపడ్డారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: