క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న త‌రుణంలో హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొద్దికాలంగా క‌రోనా కేసులు పెరుగుతుండ‌టం మ‌రోవైపు ఇదే స‌మ‌యంలో ప‌లు ఆస్ప‌త్రుల్లో రోగులు, వారి కుటుంబ సభ్యులు దాడులు చేయ‌డం వంటి ఘ‌ట‌న‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో ఓవైసీ స్పందించారు. కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందిపై జరిగిన దాడి విషయంలో స్పందించారు. వైద్య సిబ్బందిపై దాడి సరి కాదని, కోవిడ్‌-19 బాధితులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు.

 


కరోనా రోగులకు సేవలందిస్తూ గాంధీ, ఇతర ఆసుపత్రుల్లో పని చేస్తున్న అటెండర్లు, వైద్య సిబ్బందిపై దాడి చేయకూడదని అస‌దుద్దీన్ ఓవైసీ అన్నారు. వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలను గౌరవించాలని అన్నారు. ఆరోగ్య సిబ్బందిపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. కాగా, అసుద్దీన్ ఓవైసీ చేసిన ఈ సూచ‌న‌లు ప‌లువురు స్వాగ‌తిస్తున్నారు. అయితే, బాధ్య‌తాయుత‌మైన ఎంపీగా ఈ సూచ‌నను మ‌రింత ముందు చేసి ఉంటే ఇంకా బాగుండేద‌‌ని పేర్కొంటున్నారు.

 

కాగా, ఇటీవ‌ల సైతం అస‌దుద్దీన్ ఓవైసీ క‌రోనా విష‌యంలో ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఒవైసీ విమర్శించారు. ప్రజలతో చప్పట్లు కొట్టించి, దీపాలు వెలిగించి, పటాకులు పేల్చమంటూ చెప్పిన ప్రధాని మోదీ.. కరోనాను ఎందుకు అరికట్టలేకపోయారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకోవద్దని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ఎవరి ప్రాణాలను వారే రక్షించుకోవాలని సూచించారు. నమాజు సందర్భంగా భౌతికదూరం పాటించాలని, వృద్ధులు, పిల్లలను మసీదులకు తీసుకెళ్లవద్దని అస‌దుద్దీన్ ఓవైసీ కోరారు. ఎలాంటి జ్వరం లక్షణాలున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని అన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కేంద్రం రాష్ర్టాలకు కూడా కనీస సాయం చేయలేదని ఓవైసీ విమర్శించారు. ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని పెంచడానికి అనవసర ఆంక్షలను విధించడమేమిటని అసద్‌ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: