అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి, ఆయ‌న నిర్ణ‌యాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న‌కు లెక్క‌లేనంత తిక్క ఉంద‌నే ప్రచారం ఉంది. తాజాగా ట్రంప్ త‌న భిన్న‌త్వాన్ని చాటుకున్నారు. కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో.. అమెరికాలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటున్నారు. మ‌రోవై‌పు ఇదే స‌మ‌యంలో...వ‌చ్చే నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు ట్రంప్‌ గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారు. వచ్చే శుక్రవారం నుంచి ఆయన బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

 

 

అమెరికాలో ఇప్పటివరకు 20 లక్షల కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. సుమారు 113000 మంది వైరస్‌తో మరణించారు. ఇలాంటి సమ‌యంలో వ‌చ్చే శుక్ర‌వారం నుంచి తుల్సా ప్రాంతం నుంచి ట్రంప్‌ తన ఎన్నికల ర్యాలీలను ప్రారంభించనున్నారు. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేందుకు ట్రంప్‌ ఉత్సహాంగా ఉన్న నేప‌థ్యంలో...ఈ ప్ర‌చార‌ ర్యాలీలు మొదలయితే.. రెండో దఫా వైరస్‌ కేసుల విజృంభణ కొనసాగే ప్రమాదం ఉందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ట్రంప్ తమ పార్టీ మద్దతుదారులకు మాత్రం ఓ క్లారిటీ ఇచ్చారు.  సభకు హాజరు కావాలనుకుంటున్న వారి నుంచి ఆయన ఓ హామీ పత్రాన్ని తీసుకోనున్నారు. ఒకవేళ ఎన్నికల ర్యాలీలకు ఎవరు హాజరైనా.. వారు తమ ప్రభుత్వాన్ని వైరస్‌ విషయంలో నిలదీయరాదు అని ఆంక్షలను విధించారు. 

 

 

ఓక్లహామాలోని తుల్సాలో వచ్చే శుక్రవారం ట్రంప్‌ తన తొలి ర్యాలీలో పాల్గొననున్నారు. అయితే ఆ సభకు టికెట్లు జారీ చేస్తున్న వెబ్‌సైట్‌ ఓ స్పష్టమైన ప్రకటన చేసింది.  సభ కారణంగా ఎవరికి వైరస్‌ సోకినా,  దాని వల్ల ఎవరూ బాధ్యులు కాదు అని ఆ సైట్‌లో క్లియర్‌గా పేర్కొన్నారు. అంటే ష‌ర‌తుల‌కు ఒప్పుకొంటేనే ట్రంప్ స‌భ‌కు రావ‌డం అన్న‌మాట‌. దీని ప్ర‌కారం ట్రంప్ ఎన్నిక‌ల ప్ర‌చార‌ సభలకు హాజరుకావడం వల్లే తమకు వైరస్‌ సంక్రమించిందని దేశాధ్యక్షుడిని కానీ, సభ నిర్వాహకులను కానీ ..కోర్టుకు ఈడ్చరాదంటూ జనం నుంచి హామీ పత్రంపై సంతకం తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: