ఉత్తరకోస్తా, ఒడిశా ప్రాంతాల్లో ఏర్పడిన అల్ప పీడనం శనివారానికి బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారింది. నిన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై చెదురుముదురు జల్లులు కురవగా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. ఆవర్తనం ప్రభావంతో మరో 48 గంటల పాటు వర్షాలు కురవనున్నాయి. 
 
ఉత్తరకోస్తా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ జిల్లాల్లోని ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు భారత వాతావరణ శాఖ మూడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాబోయే 24 గంటల నుంచి 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత వాతావరణ శాఖ ఏపీ, ఛత్తీస్ గఢ్, ఒడిషా, మేఘలయ రాష్ట్రాల్లో సాధారణ స్థాయి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
బంగాళఖాతంలోని పశ్చిమ - మధ్య, వాయువ్య ప్రాంతాలపై ఏర్పడిన అల్ప పీడనం రాబోయే రోజుల్లో పశ్చిమ - వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీ
పంజాబ్, జమ్మూకశ్మీర్, ఉత్తారాఖండ్ లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాజస్థాన్ రాష్ట్రంలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. 
 
సరైన సమయానికి వర్షాలు కురుస్తూ ఉండటంతో రైతులు మురిసిపోతున్నారు. తొలకరి వర్షం కురువడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. దుక్కిదున్ని పంట సాగుకు సిద్ధమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు విత్తనాలు వేయని రైతులు విత్తనాలు వేసేందుకు సిద్ధమయ్యారు.                       

మరింత సమాచారం తెలుసుకోండి: