హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. నగరంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 179 కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. . ఈ నెల 11న అత్యధికంగా 175 కేసులు నమోదు కాగా నిన్న మరింతగా కేసుల సంఖ్య పెరగడం ప్రజలను టెన్షన్ పెడుతోంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 
 
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4737 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వీరిలో 182 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 2352 మంది వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కాగా 2203 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎక్కువమంది గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన వారే కావడం గమనార్హం. ఆస్పత్రులు, పోలీస్‌ స్టేషన్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఎక్కువగా వైరస్ భారీన పడుతున్నారు. 
 
నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహమ్మారి విస్తరిస్తున్న తీరుపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో ప్రధానంగా ఎల్బీ నగర్, ప్రగతి నగర్, రాంగోపాల్‌పేట్‌ డివిజన్‌, జూబ్లీహిల్స్‌, శేరిలింగంపల్లి, ఎస్‌ఆర్‌నగర్, బోడుప్పల్‌లో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. నగరంలో అన్ని ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి చెందడంతో  ఎప్పుడు, ఎక్కడ, ఎవరినుంచి వైరస్ సోకుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. 
 
ప్రగతి నగర్‌లో సాయి భవాని టిఫిన్‌ సెంటర్‌ యజమానికి కరోనా నిర్ధారణ కావడంతో అక్కడినుంచి టిఫిన్స్ కొనుగోలు చేసిన వారంతా ఆందోళనకు గురవుతున్నారు. రాంగోపాల్‌పేట్‌ డివిజన్‌లో తాజాగా జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేసే 58 ఏళ్ల మహిళకు కరోనా నిర్ధారణ అయింది. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే ఇద్దరు పోలీసులకు కరోనా నిర్ధారణ అయింది. ప్రజలు ఎవరికి వారే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.... మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: