ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్రవేసుకున్న కుటుంబాల్లో భూమా ఫ్యామిలీ ఒకటి. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభానాగిరెడ్డిలు ఏపీ రాజకీయాల్లో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇక్కడ వారి మరణం తర్వాత భూమా ఫ్యామిలీ ప్రతిష్ట కాస్త తగ్గినట్లే కనిపిస్తోంది. ఇప్పుడు కుటుంబ పెద్దగా వ్యవహరిస్తున్న భూమా అఖిలప్రియ ఆధిపత్య రాజకీయాలకు సొంత వాళ్లే బలైపోయేలా ఉన్నారు.

 

ఇప్పటికే అఖిలప్రియతో విభేధించి ఆమె సోదరుడు వరుసయ్యే భూమా కిశోర్ రెడ్డి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇటు భూమా ఫ్యామిలీతో సన్నిహితంగా ఉండే ఏవీ సుబ్బారెడ్డికి కూడా అఖిల చెక్ పెట్టాలని చూస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇదే క్రమంలో అఖిల పెదనాన్న కుమారుడు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి కూడా అఖిల చెక్ పెట్టేయాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

 

భూమా నాగిరెడ్డి మరణం తర్వాత నంద్యాల ఉపఎన్నికలో బ్రహ్మానందరెడ్డిని టీడీపీ తరుపున బరిలో దింపిన విషయం తెలిసిందే. ఆ ఉపఎన్నికలో ఆయన భారీ మెజారిటీతో గెలిచారు. ఇక 2019 ఎన్నికలకొచ్చేసరికి అఖిల తన సొంత తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డికి టిక్కెట్ దక్కించుకోవాలని ప్రయత్నించిన కుదరలేదు. చంద్రబాబు మళ్ళీ బ్రహ్మానందరెడ్డికే టిక్కెట్ ఇచ్చారు. అయితే ఆళ్ళగడ్డలో అఖిల, నంద్యాలలో బ్రహ్మానందరెడ్డి ఓటమి పాలయ్యారు. ఇక ఓడిపోయాక ఆళ్లగడ్డ, నంద్యాలపై పట్టు తెచ్చుకోవడానికి అఖిల ప్రయత్నిస్తుంది.

 

ఈ క్రమంలోనే బ్రహ్మానందరెడ్డికి కూడా అఖిల చెక్ పెట్టడం ఖాయమని అర్ధమైపోతుంది. ఇప్పటికే తన తమ్ముడు కోసం బ్రహ్మానందరెడ్డిని పక్కకు తప్పించే కార్యక్రమం జరుగుతుందట. అయితే ఈ విషయం అర్ధం చేసుకున్న బ్రహ్మానందరెడ్డి కూడా టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పైగా బ్రహ్మానంద సొంతమామ బనగానపల్లే వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. దీంతో ఆయన వైసీపీకి వెళ్ళే అవకాశముందని తెలుస్తోంది. కాకపోతే వైసీపీలోకి వెళితే బ్రహ్మానందకు టిక్కెట్ దక్కడం కష్టమని తెలుస్తోంది. ఇటు టీడీపీలో ఉన్న పెద్ద ఉపయోగం ఉండేలా లేదు. మొత్తానికైతే అఖిలప్రియ..బ్రహ్మానందరెడ్డికి చెక్ పెట్టేసినట్లే కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: