మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. తనయుడు సుధీర్‌తో కలిసి, శిద్ధా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే శిద్ధా తన గ్రానైట్ వ్యాపారాల కోసం అధికార పార్టీలో చేరారనేది బహిరంగ రహస్యమే. 2014లో దర్శి అసెంబ్లీ నుంచి గెలిచి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన శిద్ధా.. 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

 

అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో  శిద్ధా గ్రానైట్ వ్యాపారాలపై దాడులు జరిగాయి. అధికారులు గ్రానైట్ క్వారీలు సీజ్ చేశారు. దీంతో శిద్ధా కోర్టుకెళ్ళి స్టే కూడా తెచ్చుకున్నారు. అయినా లాక్ డౌన్ నేపథ్యంలో మళ్ళీ గ్రానైట్ వ్యాపారాలపై దెబ్బ పడింది. ఇక లాభం లేదనుకుని శిద్ధా...తనయుడుతో కలిసి వైసీపీలో చేరారు. వైసీపీలో చేరాక శిద్ధా వ్యాపారాలు ఎలా నడుస్తున్నాయో తెలిసిందే.

 

ఈ విషయం పక్కనబెడితే.. శిద్ధా భవిష్యత్ రాజకీయం ఏంటనే ప్రశ్న తలెత్తితే...ఆయనకు కుదిరితే రాజ్యసభ దక్కొచ్చని తెలుస్తోంది. లేని పక్షంలో నెక్స్ట్ ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ టిక్కెట్ రావోచ్చని సమాచారం. ఒకవేళ శిద్ధా పోటీచేయకపోయినా..ఆయన తనయుడు సుధీర్‌కు టిక్కెట్ దక్కొచ్చని తెలుస్తోంది. అయితే శిద్ధా ఫ్యామిలీకి దర్శి టిక్కెట్ ఇస్తే..ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ పరిస్తితి గందరగోళంలో పడినట్లే.

 

వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కడం చాలా కష్టమని తెలుస్తోంది. దర్శిలో ఆయన ఎఫెక్టివ్‌గా పనిచేయడం లేదని, అసలు ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండటం లేదని, ఎక్కువ శాతం బెంగళూరులో ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్నారని టాక్. దీంతో మళ్ళీ మద్దిశెట్టికి టిక్కెట్ ఇస్తే వైసీపీ విజయం సాధించడం చాలా కష్టం. అదే దర్శిపై గట్టి పట్టున శిద్ధా ఫ్యామిలీకి ఇస్తే విజయానికి ఎలాంటి ఢోకా ఉండదు. మొత్తానికైతే శిద్ధా వైసీపీలో చేరి మంచి ఆఫర్లే కొట్టేసినట్లు కనబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: