ఏపీ చరిత్రలో లేని విధంగా విజయం సాధించి జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రుల పనితీరుపై పలు చర్చలు వస్తున్నాయి. ఎలాగో రెండున్నర ఏళ్ళకు పనితీరు సరిగా లేని మంత్రులని పక్కనబెట్టేసి, కొత్తవారికి అవకాశం ఇస్తానని జగన్ మంత్రివర్గం ఏర్పాటు చేసే రోజు చెప్పిన విషయం తెలిసిందే.

 

దీంతో నెక్స్ట్ టర్మ్ ఎవరిని తీసేస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో ముగ్గురు మంత్రుల్లో ఎవరు ఉంటారో ఎవరు ఊడతారనే విషయం ఒకసారి చూసుకుంటే... కృష్ణాలో కొడాలి నాని మంత్రి పదవి నుంచి తొలగించడం కష్టమని తెలుస్తోంది. ఎందుకంటే కొడాలి...జగన్‌కు సన్నిహిత నేత. పైగా టీడీపీని ధీటుగా ఎదురుకుంటారు. కమ్మ నేత. కమ్మ సామాజికవర్గంలో మంత్రి అయ్యే అవకాశం మరో నేతకు లేదు. కాబట్టి కొడాలి ఐదేళ్లు మంత్రిగా కొనసాగడం ఖాయం.

 

ఇక మంత్రి పేర్ని నాని విషయంలో కాస్త అనుమానాలు ఉన్నాయి. మంత్రిగా బాగానే వర్క్ చేస్తున్న పేర్ని, ప్రత్యర్ధులకు చురకలు అంటించడంలో తిరుగులేని మంత్రిగా ఉన్నారు. కాకపోతే కాపు సామాజికవర్గంలో మంత్రులు ఎక్కువగా ఉన్నారు. అవంతి శ్రీనివాస్, కన్నబాబు, ఆళ్ళ నానిలు ఉన్నారు. మరి వీరిలో జగన్ ఎవరికి ఐదేళ్లు కొనసాగే అవకాశం కల్పిస్తారో తెలియదు. కానీ వీరిలో పనితీరు ఆధారంగా చూసుకుంటే పేర్ని నానిని మంత్రిగా కొనసాగించే అవకాశాలున్నాయి.

 

అటు వెల్లంపల్లి శ్రీనివాస్‌ని అయితే తప్పనిసరిగా మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఈయన పనితీరు కూడా అంతగా బాగున్నట్లు కనబడటం లేదనే చర్చ నడుస్తోంది. అందుకే నెక్స్ట్ టర్మ్ ఈయన పదవి ఊడటం ఖాయమని అర్ధమవుతుంది. అయితే వెల్లంపల్లి సామాజికవర్గానికే చెందిన కొలగట్ల వీరభద్రస్వామికి గానీ, అన్నా రాంబాబులకు గానీ పదవి దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరి చూడాలి వచ్చే ఏడాదిన్నరలో ఎవరి పదవి ఉంటుందో? ఎవరి పదవి పోతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: