తెలంగాణ లో వైరస్ బారిన రాష్ట్ర ప్రజా ప్రతినిధులు కూడా పడుతున్నారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే వైరస్ కోరల్లో చిక్కున్నారు. ఆయన పేరు బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి. ఆయన శనివారం నాడు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

 

రెండు రోజుల క్రితం జరిగిన ప్రైవేటు మీటింగ్‌లో జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో కలిసి కాసేపు సమయం గడిపిన బాజిరెడ్డి గోవర్థన్.. ముత్తిరెడ్డికి పాజిటివ్ అని తేలడంతో వెంటనే నిజామాబాజ్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డికి సమాచారం అందించారు. ఆయన 3 రోజుల నుంచి జ్వరం, దగ్గుతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తర్వాత ఆయనకు వైద్య పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన్ను వెంటనే చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

 

ఇదిలా ఉండగా…. తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం రాష్ట్రంలో కొత్తగా మరో 237 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్ లోనే 195 కరోనా కేసులు నమోదు కావడం నగర వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.

 

తాజా కేసులతో కలిపితే రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 4,974కు చేరింది. కరోనా ప్రభావంతో ఆదివారం రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారు. దీంతో కరోనాతో ఇప్పటివరకు మొత్తం 185 మంది చనిపోయారు.

 

ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 2, 412మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక, కరోనా బారి నుంచి కోలుకొని 2,377మంది డిశ్చార్జ్ అయ్యారు.

 

మేడ్చల్‌ జిల్లాలో 10, రంగారెడ్డి జిల్లాలో 8, సంగారెడ్డి జిల్లాలో 5, మంచిర్యాల జిల్లాలో 3 కేసులు గుర్తించారు. వరంగల్ అర్బన్‌, కామారెడ్డి, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి. అలాగే వరంగల్‌ రూరల్‌, మెదక్‌, సిరిసిల్ల, ఆదిలాబాద్‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.

 

అలాగే ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర ఆఫీస్ లోని స్పెషల్ ఆఫీసర్ కు కూడా కొద్ది గంటల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. ఇతను గత రెండు రోజుల నుండి మంత్రి తోనే ఉండడం గమనార్హం. మంత్రి టెస్ట్ రిజల్ట్స్ ఇంకా రావలసి ఉంది. ఇలా ప్రజా ప్రతినిధులకే కోవిడ్ సోకడం చూస్తున్న ప్రజలు ఇంతకన్నా ఘోరం ఇంకేదైనా ఉంటుందా అని నోర్లు వెళ్ళబెడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: