టీడీపీ నుంచి వైసీపీకి వ‌ల‌స‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యే శిద్దారెడ్డి టీడీపీ అధినేత‌కు ఝ‌ల‌క్ ఇవ్వ‌డంతో ప్ర‌కాశంలో టీడీపీ ప‌రిస్థితి మారి దారుణంగా త‌యారైంది. ఇక రాయ‌ల‌సీమ జిల్లాల్లో అంతంత‌మాత్రంగా ఉన్న నేత‌లు వైసీపీ తీర్థం పుచ్చేసుకుంటున్నారు. నాయ‌కులను బెదిరించో.. ప్రలోభ పెట్టో.. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ పార్టీలోకి  నేత‌ల‌ను లాగేసుకుంటున్నార‌ని టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా విమ‌ర్శలు  చేయ‌డం విశేషం. అయితే చంద్ర‌బాబు చేస్తున్న విమ‌ర్శ‌ల‌లో ఏమాత్రం ప‌స‌లేద‌ని, అస‌లు విష‌యం మాత్రం వేరే ఉంద‌ని చెబుతున్నారు. 

 

పార్టీని,నేత‌ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోన‌ప్పుడు కొన‌సాగి ఏం లాభమనే నేత‌లు త‌మ దారి తాము చేసుకుంటున్నార‌ని అనంత‌పురం జిల్లాకు చెందిన ఓ సీనియ‌ర్ నేత వ్యాఖ్య‌నించారు. అంతేకాదు త్వ‌ర‌లోనే ఇక్క‌డి నుంచి భారీగా వ‌ల‌స‌లు ఉంటాయ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. మా పిల్లలు కూడా ప‌క్క చూపులు చూస్తున్నారంటూ ఇప్పుడు పెద్ద రాజ‌కీయ బాంబు పేల్చారు. ఇప్పుడు అనంత‌పురం టీడీపీలో ఏం జ‌రుగుతోంద‌నే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇప్పుడు రాజ‌కీయ తెర‌వెనుక మొత్తం ఇదే చ‌ర్చ జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో అనంత‌పురం నుంచి ముగ్గురు కీల‌క నేత‌ల వార‌సులు రంగంలోకి దిగారు. అయితే స‌ద‌రు ముగ్గురు యువ‌నేత‌లు కూడా ఓడిపోయారు.


అయితే పార్టీ కోసం ప‌నిచేయాల‌ని క‌ట్టుబడి ఉన్నా..అధినేత నుంచి క‌నీస స‌హ‌కారం క‌రువ‌వుతోంద‌ని వాపోతున్నార‌ట‌. పైగా అనేక విష‌యాల్లో ఇబ్బందులు ఎదుర‌వుతున్నా ఎదురొడ్డి పోరాడుతున్నా చంద్ర‌బాబు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, త‌మ‌కు గుర్తింపు ఉండ‌టం లేద‌ని అసంతృప్తితో ర‌గిలిపోతున్నార‌ని స‌మాచారం. ఈక్ర‌మంలోనే ఇటీవ‌లి కాలంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్న స‌ద‌రు నేత‌లు పార్టీ మారేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. వీరంద‌రికి  వ్యాపారాలు కూడా ఉండ‌డంతో  వైసీపీ వ‌ల విసురుతోంద‌నే వాద‌న కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ముగ్గురిలో ఒక‌రు బీజేపీ వైపు, మిగిలిన ఇద్దరూ మాత్రం  వైసీపీ వైపు అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. విష‌యం ఇప్ప‌టికే చంద్ర‌బాబు చెవికి చేరినా  చంద్రబాబు మౌనంగా ఉన్న‌ట్లు తెలుస్తుండ‌టం గ‌మ‌నార్హం. చూడాలి ఏం జ‌రుగుతుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: