ఓవైపు క‌రోనా వైర‌స్ తీవ్ర స్థాయిలో భ‌య‌పెడుతుంటే.. మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడికి దెబ్బ దెబ్బ మీద త‌గులుతోంది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న టీడీపీని  అష్ట దిగ్బంధనం చేసి ఊపిరి సలపనీయకుండా చేస్తోంది వైసీపీ. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కి.. రాజ‌కీయ అనుభ‌వ‌మే లేని ఏపీ సీఎం, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. శత్రువు ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా తీసుకోవాలని గతంలో ప్రతిపక్ష పార్టీ అధినేతగా జ‌గ‌న్ చెప్పిన డైలాగ్‌నే ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూపిస్తున్నాడు.

 

అధికారంలోకి రాగానే సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తూనే.. మ‌రోప‌క్క ప్రతిపక్షాన్ని నిర్వీర్వం చేసే దిశగా జగన్ గ్యాప్‌ లేకుండా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అటు టీడీపీ నేత‌ల జంపింగుల ప‌ర్వం.. ఇటు అరెస్టుల ప‌ర్వం ఊపందుకుంది. వాస్త‌వానికి టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలవగా వల్లభనేని వంశీ,మద్దాలి గిరి, కరణం బలరాంలు పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు సభలో టీడీపీ వాస్తవ బలం 20కి చేరింది. మరో ముగ్గురు సభ్యులు ఇదే తరహాలో దూరమైతే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా దక్కదు. 

 

ఇప్పటికే పలువురు టీడీపీ సభ్యులు తమతో టచ్ లో ఉన్నారని  వైసీపీ చెబుతుంది. ఈ స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న చంద్ర‌బాబుకు మ‌ళ్లీ దెబ్బ మీద దెబ్బ ప‌డుతోంది. ఒక పక్క కేంద్రం నుంచి రంగంలోకి దిగిన ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడులు, మరో పక్క, రాష్ట్ర ప్రభుత్వ శాఖల దాడులతో తెలుగుదేశం పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక ఇప్ప‌టికే  మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు  ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్ట్ చేశారు. 

 

ఆ త‌ర్వాతి రోజే టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక నెక్ట్స్ టార్గెట్ చంద్ర‌బాబు త‌న‌యుడు నానా లోకేష్ అని ప్ర‌చారం జ‌ర‌గుతోంది. ఇక ఆ త‌ర్వాత మ‌రో ఇద్ద‌రు మాజీ మంత్రుల‌ను కూడా అరెస్ట్ చేయ‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఇలా చంద్ర‌బాబుకు త‌గులుతున్న వ‌రుస షాకు‌లు చూస్తుంటే.. టీడీపీ కుప్పకూలిపోవడమే లక్ష్యంగా జగన్ అడుగులు వేస్తున్నార‌ని స్పష్టంగా అర్థం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: