ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌జ‌లంద‌రినీ ఏ స్థాయిలో భ‌య‌పెడుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. మ‌రోవైపు టీడీపీ నేత‌ల‌కు మాత్రం దిన‌దిన గండంగా మారుతోంది. తెల్లారితే ఎవ‌రి త‌ల రాత ఎలా ఉంటుందో తెలియ‌క ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈఎస్ఐ మందుల కొనుగోలు వ్యవహారంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు 150 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని పేర్కొన్నారు. 

 

అయితే అచ్చెన్నాయుడి అరెస్ట్ ఒక సినిమాను త‌ల‌పించిదంటే అతిశ‌యోక్తి కాదు. గోడలు దూకారు...మెట్లపై నక్కారు.. వీధుల్లో పొంచి.. పరిసరాలను కట్టడి చేశారు.. అచ్చెన్న అరెస్టు సమయంలో పోలీసులు, ఏసీబీ అధికారులు చేసిన హడావుడి ఇది.  గ్రామంలో ఎటుచూసినా పోలీస్‌ వాహనాలే కనిపించాయి.  చివ‌ర‌కు శ్రీ‌కాకుళం జిల్లాలో స్వ‌గ్రామంలో ఉంటున్న అచ్చెన్నాయుడి అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక తెల్లారితే రెండోరోజు శ‌నివారం. ముందు రోజూ లాగే తెల్లార‌గానే మ‌రో టీడీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న కుమారుడు అస్మిత్‌రెడ్డిల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రవాణా వాహనాల్లో అక్రమాలు చేశారంటూ జేసీ ప్రభాకర్‌ రెడ్డిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

రవాణాశాఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హైదరాబాద్‌లోని వారి ఇంట్లో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అచ్చెన్నాయుడు అరెస్టులో జరిగిన హైడ్రామానే... అటూఇటుగా జేసీ ప్రభాకర్‌ రెడ్డి విషయంలోనూ జరిగింది. ఇలా ఒకరి తర్వాత ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. రేపోమాపో మ‌రో మాజీ మంత్రి కూడా అరెస్ట్ అవ్వ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఆ త‌ర్వాత చంద్ర‌బాబు త‌న‌యుడు నానా లోకేష్ పేరు కూడా వినిపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను అందిపుచ్చుకొని ఎండగట్టడం ద్వారా బలపడదామని అనుకుంటున్న టీడీపీని కోలుకోలేని దెబ్బలు త‌గులుతున్నాయి. అయితే స్క్రిప్ట్ ర‌చ‌యిత ఎవ‌రో తెలియ‌దు కానీ.. షూటింగ్స్ లేకుండా, థియేట‌ర్ల‌తో అవ‌స‌రం రాకుండా ఏపీ ప్ర‌జ‌ల‌కు.. ముఖ్యంగా టీడీపీ నేత‌ల‌కు బిగ్ స్క్రీన్‌పై ఒక టికెట్టు రెండు సినిమాలు చూపిస్తోంది ప్ర‌భుత్వం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: