కరోనా దెబ్బకు ప్రపంచదేశాలన్నీ  ఆర్థికమాంద్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికాకు సంబంధించి ఓ షాకింగ్ రిపోర్టు ఒకటి వెలుగులోకి వచ్చింది.  గత ఫిబ్రవరిలోనే  అమెరికా ఎకానమీ మాంద్యంలోకి ప్రవేశించిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

 

కోవిడ్‌ దెబ్బకు అమెరికా అతలాకుతలమైపోయింది. ఆర్థికవ్యవస్థ పతనావస్థతో అగ్రరాజ్యం అల్లాడుతోంది. అధికారికంగా 128నెలల ఆర్థిక వృద్ధికి ముగింపు పలికి మాంద్యం లోకి ప్రవేశించింది. ఉపాధి కల్పన, ఉత్పత్తి క్షీణతలో అసాధారణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా మందగించడంతో ఊహించిన దానికంటే వేగంగా మాంద్యంలోకి జారుకుంది. మహమ్మారి దేశాన్ని తుడిచిపెట్టేసిందని బిజినెస్ సైకిల్ డేటింగ్ కమిటీ నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ ప్రకటించింది. దేశంలో సెకెండ్ వేవ్ వైరస్‌ విజృంభిస్తే అమెరికా పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

 

వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఆర్ధిక వ్యవస్థలో కొంత సానుకూల మార్పు రావొచ్చని అంచనా. 2007- 09 కాలంలో అనేక లక్షల బ్లూ కాలర్ ఉద్యోగాలు శాశ్వతంగా కోల్పోవడం, దీర్ఘకాలిక నిరుద్యోగం, మధ్య- తక్కువ ఆదాయ కుటుంబాల బలహీనమైన వేతన వృద్ధి లాంటి అంశాలను పరిశోధనలు గుర్తు చేస్తున్నాయి. ఆర్థిక వృద్ది పురోగమనం వీటిపై ఆధారపడి వుంటుందని తేల్చి చెబుతున్నాయి. జీడీపీ ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 4.8 శాతం పడిపోయింది. నిరుద్యోగిత రేటు ఫిబ్రవరిలో కనిష్టంగా 3.5 శాతంగా నమోదైంది.  ఏప్రిల్‌లో 14.7 శాతానికి, మే నెలలో 13.3 శాతానికి చేరింది.  

 

ఆర్థికసంక్షోభంతో మరో ఉపశమన ప్యాకేజీకి  ట్రంప్ సిద్ధంగా ఉన్నారని వైట్ హౌస్ ప్రతినిథులు చెబుతున్నారు.  మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశాలు ఈ వారం ప్రారంభం కానున్నాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ చర్యలపై అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టనున్నారని భావిస్తున్నారు. పెట్టుబడిదారులకు భారీ ఊరట లభించనుందని అంచనా వేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: