హెచ్ 1 బీ వీసాదారులు ఇప్పటికే యుఎస్‌లో ఉద్యోగాలు కోల్పోయారు. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో వీరంతా దేశానికి తిరిగి వస్తున్నారు. ఇంతలోనే ట్రంప్‌ తీసుకోబోయే నిర్ణయం... మరింత ఆందోళన కలిగిస్తోంది. 

 

స్వదేశంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి... అమెరికాలో ఎంఎస్‌ చేయాలని.. ఆ తర్వాత మూడే ళ్లు ఓపీటీ, శిక్షణలో ఉండగానే హెచ్‌1బీ వీసాకు దరఖాస్తు చేసుకోవడం... హెచ్‌1బీ వస్తే మూడేళ్లపాటు అక్కడే. ఈ లోగా ఏదైనా కంపెనీలో ఉద్యోగం సాధించి ఆ కంపెనీ ఆమోదంతో గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవడం, ఒకవేళ గ్రీన్ కార్డ్ పెండింగ్‌లో ఉన్నంత కాలం హెచ్‌1బీ వీసా గడువును పెంచుకుంటూ ఉండటం... అమెరికాలోని భారతీయ ఉద్యోగులు పాటించే వరుస ఇదే.

 

2021 ఆర్థిక సంవత్సరానికి అమెరికాలో హెచ్‌1బీ వీసా కింద ఎవరు ఎంపికయ్యారో.. అమెరికా పౌరసత్వం, విదేశీ సేవల విభాగం తాజాగా వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలు తమకు ఉద్యోగం ఇస్తాయో? లేదో? అనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. హెచ్‌1బీ వీసా కోసం ప్రతి ఏడాది రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా పెరుగుతోంది.

 

2019 ఆర్ధిక సంవత్సరం కంటే 2020లో ఈసారి 74 వేల మంది అధికంగా పోటీపడ్డారు. మొత్తం 2.75 లక్షల దరఖాస్తులు అందటం గమనార్హం. వీటిలో 68 శాతం దరఖాస్తులు మన దేశం నుంచి రాగా, చైనా నుంచి మరో 13 శాతం దరఖాస్తులు అందాయి. హెచ్‌1బీ వీసా కోసం మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఈ-రిజిస్ట్రేషన్‌ ద్వారా ఆయా ఎంప్లాయర్‌ నుంచి యూఎస్‌ఐసీఎస్‌ దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం 85 వేల వీసాల్లో మొదట అందిన దరఖాస్తుల నుంచి జనరల్‌ కోటా కింద 65 వేల మందిని ఎంపిక చేశారు.

 

ఏటా 70 శాతం వరకు హెచ్ 1 బీ వీసాలు మనవారికి దక్కుతున్నాయి. మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేసిన వారి దరఖాస్తుల నుంచి మాస్టర్స్‌ కోటా కింద 20 వేల మందిని ఎంపిక చేశారు. ఈసారి లాటరీలో కొత్త పద్ధతిలో భారతీయ విద్యార్థులు అధిక సంఖ్యలో ఎంపికైనట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతీయులు దరఖాస్తు చేసినప్పుడు... కరోనా ఉద్ధృతి అస్సలు లేదు. ప్రస్తుతం పరిస్థితి మారిపోవడంతో జూన్‌ 30వ తేదీ వరకు కంపెనీలు పూర్తి స్థాయి దరఖాస్తు సమర్పిస్తాయా? లేదా? అనే  సందిగ్ధత మొదలైంది. 

 

ఆయా కంపెనీ దరఖాస్తు దాఖలు చేస్తే దాదాపు హెచ్‌1బీ వచ్చినట్లే. జూన్‌ 30వరకు గడువు వుండటంతో ఆసక్తికరంగా మారింది. వీసా దక్కిన తర్వాత ఆ కంపెనీ చేర్చుకోకపోయినా... 2 నెలల లోపు ఏదో ఒక కన్సల్టెన్సీలో చేరే అవకాశం ఉందని... ఓపీటీపై వర్క్ చేస్తూ హెచ్‌1బీ వీసాకి ఎంపికైన విద్యార్థుల మనోగతం.  కరోనా ప్రభావం తగ్గిన తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. మొత్తానికి భారతీయ విద్యార్థులు కలవరం పోవాలంటే వచ్చే జూన్ నెలాఖరు వరకు ఆగాల్సిందే.

 

ఇప్పటికే టీ నిపుణులు అమెరికా వెళ్లేందుకు అత్యధికంగా వినియోగించే హెచ్‌1బీ వీసాల జారీ తగ్గిపోయింది. ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఈ వీసాల విషయంలో కఠినంగా ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది.  అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2018లో వీటి జారీ 10శాతం తగ్గింది.

 

2018 సంవత్సరానికి గాను రెన్యూవల్స్‌ సహా కలిపి 3,35,000 హెచ్‌1బీ వీసాలను మాత్రమే మంజూరు చేసినట్లు అమెరికా సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ లెక్కలు చెబుతున్నాయి. ఇవే వీసాలు 2017లో 3,73,400 మంజూరు చేశారు. అంటే 2017లో వచ్చిన ప్రతి 100 దరఖాస్తు 93కు ఆమోద ముద్రపడగా.. 2018 నాటికి కేవలం 85కు మాత్రమే గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. అదే ఏడాది మొదటి ఆరు నెలల్లో నూటికి 79 వీసాలను మాత్రమే ఆమోదించారు. చివర్లో కొంత ఉదారంగా ఉండటంతో అది 85 శాతానికి చేరింది. 2018లో 8.50 లక్షల నేచురలైజేషన్‌ దరఖాస్తులను పరిష్కరించారు. హెచ్‌1బీ వీసాల వినియోగాన్ని తగ్గించాలని ప్రభుత్వం నుంచి తీవ్ర  ఒత్తిడి ఉండటంతో జారీకి కళ్లెం వేసే పనిలో పడింది అగ్రరాజ్యం. అదే జరిగితే లక్షలాది మంది భారతీయుల కల చెదిరినట్టేనా..?

మరింత సమాచారం తెలుసుకోండి: