ఢిల్లీలో అందరికీ కరోనా టెస్టులు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అఖిలపక్షానికి హామీ ఇచ్చారు. ఢిల్లీలో కేసులు పెరుగుతున్న తరుణంలో ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్ లో.. కరోనా ఉధృతిపై ఆందోళన వ్యక్తమైంది. అందరికీ టెస్టులు చేయాలని అన్ని పార్టీలూ కోరడంతో.. కేంద్రం సమ్మతించింది. ఢిల్లీలో మరోసారి లాక్ డౌన్ ఆలోచన లేదని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. 

 

దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో రాజధాని ఢిల్లీ మూడో స్థానంలో ఉండటం అందర్నీ కలవరపెడుతోంది. ఇప్పటికే ఢిల్లీలో కరోనా పరిస్థితిపై లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, సీఎం కేజ్రీవాల్ తో కలిసి ఆదివారం సమీక్షించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఢిల్లీ కరోనా బాధితుల కోసం 500 రైల్వే కోచ్ లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దానికి కొనసాగింపుగా సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ కు బీజేపీ, కాంగ్రెస్, ఆప్ తో పాటు బీఎస్పీ, ఎస్పీ నేతలు కూడా హాజరయ్యారు. 

 

ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఆల్ పార్టీ మీటింగ్ లో ఆందోళన వ్యక్తమైంది. అందరికీ టెస్టులు చేయాలని, టెస్టుల సంఖ్య కూడా బాగా పెంచాలని అన్ని పార్టీలూ డిమాండ్ చేశాయి. దీంతో ఢిల్లీలో అందరికీ టెస్టులు చేస్తామని హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ హామీ ఇచ్చారు. టెస్టుల సంఖ్య కూడా కొద్ది రోజుల్లోనే 18 వేలకు పెంచుతామని తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తామన్నారు. 

 

కరోనా బాధిత కుటుంబాలు, కంటైన్మెంట్ జోన్లో ఉన్న ప్రతి కుటుంబానికి పది వేల రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్ని నాన్ పర్మనెంట్ రెసిడెంట్ డాక్టర్లుగా చూడాలని కోరింది. ఢిల్లీలో కరోనా వచ్చిందనే అనుమానం ఉన్న ప్రతివారికీ టెస్టులు చేయించుకునే సౌలభ్యం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే టెస్టుల విషయంలో ఢిల్లీ వాసుల్లో ఆందోళన ఉందని ఆ పార్టీ కేంద్రం దృష్టికి తెచ్చింది. 

 

పార్టీలకు అతీతంగా నేతలంతా టెస్టుల సంఖ్య పెంచాలని కోరడంతో.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దానికి సమ్మతించారు. ఇప్పటికే ఢిల్లీలో కరోనా కట్టడికి అత్యున్నత స్థాయి సమీక్షలో తీసుకున్న నిర్ణయాల్ని అన్ని పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఢిల్లీలో కరోనాపై పోరాటానికి కేంద్రం సిద్ధంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. 

 

ఈ నెల 20 నాటికి ఢిల్లీలో రోజువారీ టెస్టుల సంఖ్య 18 వేలకు చేరుతుందని అన్ని పార్టీల ప్రతినిధులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఢిల్లీలో మళ్లీ లాక్ డౌన్ విధించే ఉద్దేశం లేదని సీఎం కేజ్రీవాల్ క్లారిటీ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: