జగన్ ఎపుడూ గెలుస్తూనే ఉంటాడు. అయితే ఆయనది క్లైమాక్స్ లో వచ్చే విక్టరీ. అంతవరకూ ఇబ్బందులు  పడీ పడీ టెన్షన్ పడిన వారంతా ఊపిరి పీల్చుకునే భారీ విజయం జగన్ సొంతం అవుతుంది. అది గత ఏడాది జరిగింది కూడా. మరి ఇపుడేంటి జగన్ గెలవడం అనుకుంటారేమో.

 

జగన్ గెలుపు మరిన్ని గెలుపులకు పిలుపు అవుతోంది. తాజాగా శాసనమండలిలో ఖాళీ అయిన ఒక స్థానానికి నోటిఫికేషన్ జారీ అయింది. అది టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా  మాణిక్యప్రసాద్ కి సంబంధించింది. ఆయన గత డిసెంబర్లో పార్టీకి, ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. ఆయన జగన్ పార్టీలో చేరిపోయారు కూడా.

 

ఇపుడు ఆ సీటు ఖాళీ అయింది. భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. దానికీ సంబంధించి ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనుంది. జులై 6వ తేదీన పోలింగ్ జరగనుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నె 25వ తేదీ వరకూ గడువు విధించారు. 29 వతేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.

 

ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడున్న సంఖ్యాబలం చూస్తే  శాసనసభ్యుల కోటాలో ఈ స్థానం భర్తీ కానుండటంతో వైసీపీకే ఈ స్థానం దక్కనుంది. వైసీపీ నుంచి ఎవరికి ఈ సీటు దక్కుతుంది అన్నది చర్చగా ఉంది. అయితే విద్యావంతుడు, నిజాయతీపరుడు, దలిట సమాజికవర్గానికి చెందిన డొక్కా మాణిక్య ప్రసాద్ కే ఈ సీటు జగన్ తిరిగి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని అంటున్నారు. ఆయనకు 2024 ఎన్నికల్లో టికెట్ కి జగన్ ప్రామిస్ చేశారు. అయితే అప్పటికి నాలుగేళ్ల కాలం ఉన్నందువల్ల ఈ లోగా ఆయన్ని పెద్దల సభలో కూర్చోబెట్టాలని జగన్ భావించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 

ఇవన్నీ ఇలా ఉంటే శాసనమండలి రద్దు కాకపోవడం వల్ల కలిగిన  తొలి  రాజకీయ లాభం ఏంటో జగన్ సర్కార్ రుచి చూసింది. కేంద్రం ఈ విషయంలో ఎంత ఆలస్యం చేస్తే అంత రాజకీయ ప్రయోజనం కూడా జగన్ పార్టీకే దక్కుతుంది. ఏడాది తరువాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో జగన్ పార్టీ గెలవడం అంటే అది పాత గెలుపుని రెట్టింపు చేస్తుందనే చెప్పాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: