మాజీ సీఎం చంద్రబాబు మరోసారి పొలిటికల్ గా రాంగ్ స్టెప్ వేశారా.. వైసీపీ సర్కారుపై రాజకీయంగా పైచేయి సాధించాలన్న తాపత్రయంలో మరో తప్పటడుగు వేశారా అంటే అవుననే అనిపిస్తోంది. ప్రతిపక్షంగా ప్రభుత్వం చేసే తప్పులను ఎండగట్టడం మంచిదే. అలాగే అధికారం ఉంది కదా అని ప్రభుత్వం విర్రవీగుతూ చేసే పనులపై నిరసన గళం, తిరుగుబాటు ధోరణి కూడా ఆహ్వానించదగిందే..

 

 

కానీ ఆ నిరసన, ఆ తిరుగుబాటు ప్రజలు మెచ్చేలా ఉండాలి. తప్పు చేసిన వాడు తమ పార్టీ అయినంత మాత్రాన సమర్థించేస్తాం అని ఫీలైతే జనం దాన్ని అంగీకరించరు. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది అదే. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి వారి అరెస్టులను టీడీపీ ఖండిచడం కక్ష సాధింపుగా ప్రచారం చేయడం ఆ పార్టీకే బూమరాంగ్ అవుతుంది. అచ్చెన్నాయుడి విషయంలో కాస్త అటూ ఇటూగా ఉండొచ్చేమో కానీ.. జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి వారిని కూడా సమర్థించడం అంటే.. తామేం చేసినా రైటే అని గుడ్డిగా సమర్థించుకోవడమే.

 

 

జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాపారమే ట్రావెల్స్.. ఈ రంగంలో పాత లారీలను బస్సులుగా మార్చి.. కాలం చెల్లిన వాహనాలు నడిపి ప్రజల ప్రాణాలను బలిగొన్న చరిత్ర జేసీ బ్రదర్స్‌ కు ఉంది. అలాంటి వ్యక్తులు సాక్ష్యాధారాలతో సహా దొరికిపోతే.. పార్టీ నాయకుడు ఏం చేయాలి. అలాంటి నేతలను పార్టీకి దూరం పెట్టాలి.. లేదా.. సైలంట్ గా ఉండిపోవాలి. కానీ ఆ అరెస్టయిన నాయకుడు ఏదో మహాత్ముడైనట్టు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తే జనం ఏమనుకుంటారు..?

 

 

పోనీ.. ఎంత చెడ్డా సొంత పార్టీ నాయకుడు కదా అనుకుని సరిపెట్టుకోవచ్చు. కానీ.. ఆ కుటుంబానికి పరామర్శలు, సానుభూతి ప్రకటనలు.. అక్కడకు వెళ్లి సదరు నేతలకు క్లీన్ చిట్‌ ఇవ్వడాలు.. ఇలాంటి రాజకీయ ఎత్తుగడలతోనే కదా.. ఈ స్థితికి పార్టీని తెచ్చుకుంది. ఇంకా అదే ధోరణా అంటున్నారు తెలుగుదేశం శ్రేయోభిలాషులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: