జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా విజృంభించిన రోజు నుంచి జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై ఎక్కువగా విమర్శలు చేయడంతో పాటు సోషల్ మీడియా ద్వారా సీఎంను ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు కొత్త కొత్త అంశాలతో పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఆర్టీసీ అద్దెబస్సు డ్రైవర్లు పడుతున్న కష్టాల గురించి పవన్ సీఎం జగన్ కు లేఖ రాశారు. సోషల్ మీడియాలో ఆ లేఖను షేర్ చేశారు. 
 
పవన్ తన లేఖలో ఏపీఎస్ ఆర్టీసీలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి అద్దె బస్సుల్లో పని చేసే డ్రైవర్లకు జీతాలు అందడం లేదని... జీతాలు అందకపోవడం వల్ల వారి కుటుంబాలు అగచాట్లు పడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 8,000 మంది డ్రైవర్లు అద్దె బస్సుల్లో పని చేస్తున్నారని.... మార్చి నెల నుంచి వీరికి జీతాలు అందలేదని... జీవనం చాలా కష్టంగా మారిందని డ్రైవర్లు జనసేన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. 
 
ఏపీ ప్రభుత్వం వారి విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని.... వారిని ఆదుకోవాలని సూచించారు. పదేళ్ల అనుభవం ఉన్న డ్రైవర్లకు కూడా తక్కువ వేతనాలే అందుతున్నాయని.... అద్దె బస్సుల యజమానులే వారి విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించడం సరికాదని అన్నారు. సంస్థకు అద్దె బస్సుల ద్వారా సేవలు అందించిన కార్మికులు అనే కోణంలో వారి గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. 
 
ప్రభుత్వం అసలు ఆర్టీసీ బస్సులనే ఖాళీగా ఉంచుతున్న నేపథ్యంలో అద్దె బస్సుల జోలికి పోవడం లేదు. పూర్తి వేతనం చెల్లించకపోయినా ప్రభుత్వం కొంతమేర వీరికి ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని ప్రజలు సూచిస్తున్నారు. ఈ విషయంలో పవన్ చొరవను కూడా అభినందించాలని అభిప్రాయపడుతున్నారు. పవన్ లేఖ విషయంలో సీఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: