కొద్ది రోజులుగా ఏపీ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ముందు ముందు రచ్చ రచ్చ జరిగేలా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ టార్గెట్ గా అధికార పార్టీ వైసిపి దూకుడుగా వెళ్తోంది. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడమే కాకుండా, ఆ పార్టీలో ఉన్న ఏ ఒక్క కీలక నాయకుడు ఆ పార్టీలో ఉండకుండా, ఆ పార్టీకి దూరం చేయడమే ఏకైక లక్ష్యంగా అధికార పార్టీ ముందుకు వెళుతోంది. ఈ క్రమంలో కొంత మంది నాయకులను వివిధ అవినీతి ఆరోపణల పేరుతో అరెస్టు కూడా చేయిస్తోంది. ఇదిలా ఉంటే ఈ పరిణామాలను తమ రాజకీయ ఎదుగుదలకు ఉపయోగించుకుంటూ ఏపీలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
 
IHG
 
 ఏపీలో తెలుగుదేశం పార్టీ బలహీనమైతే, తాము బలపడగలము అనే విషయాన్ని గ్రహించిన బిజెపి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా ఈఎస్ఐ స్కాం లో అరెస్టు అయిన మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్ట్ ను బిజెపి సమర్థిస్తుంది. అవినీతి వ్యవహారాలకు  పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టదు అంటూ అధికార పార్టీ వైసీపీకి గట్టిగానే మద్దతు ఇస్తోంది. టీడీపీ క్రమక్రమంగా రాజకీయ ఉనికి కోల్పోతే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆశ తో బీజేపీ ఇప్పుడు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.  దీనికి తోడు బీజేపీ కీలక నాయకుడు రామ్ మాధవ్ కూడా ఏపీ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. టిడిపి పై ఆయన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు.
 
 
అలాగే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఎవరు మాట్లాడినా, ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు పంపిస్తున్నారు. ఇప్పటికే లక్ష్మీపతి రాజు అనే నాయకుడిని బిజెపి సస్పెండ్ చేసింది. అలాగే మరో ఇద్దరు నేతలకు నోటీసులు కూడా అందించింది. బీజేపీ వ్యవహారం ఇలా ఉంటే ఈ విషయాన్ని తమ రాజకీయ ఎదుగుదలకు ఉపయోగించుకుని బలపడే అవకాశం ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం అంటే  ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన తర్వాత జనసేన పార్టీ టిడిపి తో కలిసి అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొంది. ఆ తర్వాత అనూహ్య పరిణామాల నేపథ్యంలో పవన్ ఢిల్లీకి వెళ్లి బీజేపీతో పొత్తు పెట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.
 
 
 కేంద్ర అధికార పార్టీ బీజేపీతో కలిసి ఏపీలో పవన్ తన సత్తా చాటుకోవాలని,  2024 ఎన్నికల్లో బిజెపి సహకారంతో ఏపీ అధికార పీఠం దక్కించుకోవాలని ఆ పార్టీలోని నాయకులు అందరూ భావించారు. కానీ పవన్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అందివచ్చిన ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ వస్తుండడం పై ఇప్పుడు సొంత పార్టీ నేతల్లోనే తీవ్రమైన అసంతృప్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: