ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌, శాస‌న మండ‌లి స‌మావేశాలు మంగ‌ళ‌వారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ‌,టీడీపీ నాయ‌కుల వ‌రుస అరెస్టుల  నేప‌థ్యంలో జ‌ర‌గ‌నున్న‌ ఈ స‌మావేశాల‌కు రాజ‌కీయ ప్రాధాన్యం కూడా సంత‌రించుకుంది. అంతేకాకుండా రాజ‌ధానిపై కూడా మ‌రోసారి చ‌ర్చ‌కు రానుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభుషణ్ హరిచందన్ ప్రసంగం, ఆ తర్వాత బీఏసీ సమావేశం అనంతరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.  ఈ ఏడాది మార్చిలో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టనుంది. శాసనసభలో సాధారణ బడ్జెట్‌ను ఆర్థిక‌మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రవేశపెడుతారు.

 

 శాసనమండలిలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్ర‌వేశ‌పెడుతారు. వ్యవసాయ బడ్జెట్‌ను శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మండలిలో మంత్రి మోపిదేవి వెంకట రమణ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్‌లో కూడా నవరత్నాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చిన‌ట్లు స‌మాచారం. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్ళలో ఉండేలా బుగ్గన బడ్జెట్‌పై కసరత్తులు చేస్తున్నారు. వ్యవసాయ రంగానికే పెద్ద పీట ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రెండోదఫా పూర్తి బడ్జెట్‌ జనరంజకంగా ఉండనుంద‌ని తెలుస్తోంది. 

 

ఆర్థిక వ్యవస్థ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ జనరంజకంగా బడ్జెట్‌ను తీర్చిదిద్దటంపై ముఖ్యమంత్రి జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన సుదీర్ఘ కసరత్తు చేసిన‌ట్లు స‌మాచారం. నవరత్నాల హామీలన్నీ నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్‌కు రూపకల్పన చేసిన‌ట్లు  ప్ర‌జాప్ర‌తినిధులు చెబుతున్నారు. రైతాంగానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్‌ కేటాయింపుల ద్వారా ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని మరోసారి నిరూపించనుంది. వాస్త‌వానికి ఈ ఏడాది మార్చి నుంచి ఇటు రాష్ట్రం, అటు కేంద్రం నుంచి ప్రభుత్వానికి రాబడులు పూర్తిగా తగ్గిపోయాయి. కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలైనా గత సర్కారు పెద్దఎత్తున పెండింగ్‌లో పెట్టిన బిల్లులను చెల్లిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: