ఒకే ఒక దారుణమైన ఓటమి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుని ప్రశ్నార్ధకం చేసేసింది. జగన్ కొట్టిన దెబ్బకు సంవత్సరమైన చంద్రబాబు కోలుకోలేదు. అయితే ఎన్నికల్లో షాక్ నుంచి బాబు కోలుకునేలోపే తమ్ముళ్ళు భారీ షాకులు ఇస్తూ ఇంకా కోలుకోకుండా చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు పార్టీ మారితే, మరికొందరు ఓటమి తర్వాత బయటకు రావడం లేదు. ఫలితంగా చాలా నియోజకవర్గాల్లో టీడీపీ అడ్రెస్ లేకుండా పోయింది.

 

అసలు పలు నియోజకవర్గాల్లో టీడీపీని నడిపించే నాయకుడు లేరు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్తితి ఇలా ఉంటే, పార్లమెంట్ స్థానాల పరిస్తితి మరీ దారుణంగా ఉంది.  రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలు ఉంటే అందులో టీడీపీ 3 స్థానాలు గెలిచిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు స్థానాలని టీడీపీ కైవసం చేసుకుంటే, మిగిలిన 22 చోట్ల వైసీపీ గెలిచింది.

 

ఇక టీడీపీ ఓడిపోయిన 22 చోట్ల ఎంపీ అభ్యర్ధులు అడ్రెస్ లేరు. విజయనగరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన అశోక్ గజపతి రాజుకు వయసు మీద పడటం, అనారోగ్య సమస్యతో  అంతగా చురుకుగా లేరు. ఇటు అరకులో ఓడిపోయిన కిషోర్ చంద్రదేవ్ ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. అనకాపల్లిలో ఓడిన ఆడారి ఆనంద కుమార్ వైసీపీలోకి వెళ్ళగా, విశాఖపట్నంలో ఓడిపోయిన బాలయ్య చిన్న అల్లుడు శ్రీ భరత్ యాక్టివ్‌గానే ఉన్నారు.

 

ఇక కాకినాడ చలమలశెట్టి సునీల్, రాజమండ్రి మాగంటి రూపాదేవిలు అడ్రెస్ లేరు. అమలాపురంలో మాత్రం బాలయోగి కుమారుడు హరీష్ పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు. ఇక నరసాపురంలో వేటుకూరి శివరామరాజు పెద్ద యాక్టివ్‌గా లేరు. ఏలూరు మాగంటి బాబు, మచిలీపట్నం కొనకళ్ళ నారాయణలు అప్పుడప్పుడు పార్టీకి అందుబాటులో ఉంటున్నారు. బాపట్ల శ్రీరామ్ మాల్యాద్రి, నరసరావుపేట రాయపాటి సాంబశివరావులు అడ్రెస్ లేరు.

 

ఒంగోలు శిద్ధా రాఘవరావు, నెల్లూరు బీదా మస్తాన్ రావులు వైసీపీలోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ మరణించగా, కడప ఆది నారాయణరెడ్డి బీజేపీలోకి వెళ్లారు. తిరుపతి పనబాక లక్ష్మీ, కర్నూలు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిలు వైసీపీలోకి వెళ్లనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక హిందూపురం నిమ్మల కిష్టప్ప, రాజంపేట డి‌కే సత్యప్రభ, నంద్యాల మాండ్రా శివానందరెడ్డిలు పార్టీలో కనిపించడం లేదు.

 

అనంతపురంలో జేసీ దివాకర్ తనయుడు పవన్ మాత్రం యాక్టివ్ గానే ఉన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్తితి చూస్తుంటే బాబుకు భవిష్యత్‌లో కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ పరిస్తితి ఇలాగే దారుణంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీనే 20 సీట్లు పైనే గెలుచుకున్న ఆశ్చర్యపోనక్కరలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: