తెలుగు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం మరింత ఉధృతమవుతోంది. తెలంగాణలో   రోజుకు 200కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో.. కేసుల గణాంకాలు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీంతో నగరవాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంటోంది. అటు ఏపీలోనూ వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.  

 

తెలంగాణలో రోజు రోజుకూ కోవిడ్ పాజిటివ్ కేసులు .. భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల్లో  219 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.  జీహెచ్ఎంసీ పరిధిలో 189, రంగారెడ్డిలో 13, వరంగల్ అర్బన్‌లో 4, వరంగల్ రూరల్‌లో 3, మేడ్చల్, సంగారెడ్డిలో 2 కేసుల చొప్పున, మహబూబ్ నగర్, మెదక్, ఆదిలాబాద్, యాదాద్రి, వనపర్తి, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.

 

24 గంటల్లో రాష్ట్రంలో మరో ఇద్దరు చనిపోయారు. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 5 వేల 193 కి చేరింది. వీరిలో 449 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఉన్నారు. కరోనా వైరస్‌‌తో పోరాడుతూ తెలంగాణలో ఇప్పటి వరకు 2 వేల 766 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 2 వేల 240 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 187కి చేరింది.

 

ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రతి రోజు భారీగా కొత్త కేసులు భారీ స్థాయిలో నమోదవుతుండటం ఇటు ప్రజల్ని, అటు ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. సాధారణ ప్రజలతోపాటు కరోనాపై పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి కూడా మహమ్మారి బారినపడుతున్నారు. ఇప్పటికే నిమ్స్, గాంధీ ఆస్పత్రిలో పలువురికి కరోనా సోకగా.. తాజాగా పేట్ల బురుజు ఆస్పత్రిలో భారీగా కరోనా కేసులు బయటపడ్డాయి. ఒకేసారి 32 మందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో తీవ్ర కలకలం రేగింది. వీరిలో 14 మంది వైద్యులు, 18 మంది సిబ్బంది ఉన్నారు. ఒక ఆస్పత్రిలో ఒకేసారి అత్యధిక కేసులు నమోదు కావడంలో ఇదే తొలిసారి. కరోనా కేసులు భారీగా బయటపడడంతో ఆ డాక్టర్లు ఎవరెవరిని కలిశారన్న దానిపై ఆరా తీస్తున్నారు.

 

అటు ఏపీలోనూ కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 304 కేసులు నమోదయ్యాయి. ఒకరోజులో ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి. ఇందులో రాష్ట్రానికి చెందినవారు 246 మంది కాగా... ఇతర రాష్ట్రాలకు చెందినవారు 52,  ఇతర దేశాలకు సంబంధించినవారు ఆరుగురు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 6 వేల 456కి చేరింది. ఇందులో రాష్ట్రానికి చెందినవారు 5 వేల 87 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 11 వందల 59 మంది.  ఇతర దేశాల  నుంచి వచ్చినవారు 210. ఇప్పటివరకు రాష్ట్రంలో 86 మంది మరణించారు. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో  తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కూడా కరోనా కట్టడి చర్యలపై మరింత ఫోకస్ పెట్టింది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: