ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం ఇప్పుడు స్కాములు చుట్టూ తిరుగుతున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన మొత్తం అవినీతి స్కాములు బయటపెడుతూ పాత్రధారులను అరెస్టు చేస్తూ ఏపీ రాజకీయాలలో సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే మాజీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ESI కుంభకోణంలో అరెస్ట్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత జెసి దివాకర్ రెడ్డి తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డిని నకిలీ పత్రాలతో ట్రావెల్ బస్సులు తిప్పుతున్నారు అని ఆయనను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంతో వరుస అరెస్టులతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇటువంటి సమయంలో అధికారంలో ఉన్న వైసిపి పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి పై 1000 కోట్ల స్కామ్ ఆరోపణలు వస్తున్నాయి.

 

108 వాహనాలకు కాంట్రాక్టు విషయంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని బిజెపి పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపిస్తున్నారు. గతంలో 108 కాంట్రాక్ట్ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం 2018 వ సంవత్సరం లో బి ఏ జి అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఒక్కో అంబులెన్స్ నిర్వహణకు నెలకు లక్ష 31 వేలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ఐదేళ్ల పాటు ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బి ఏ జి సంస్థతో చేసుకున్న ఆ ఒప్పందాన్ని ఉద్దేశపూర్వకంగా రద్దు చేసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఆ కాంట్రాక్ట్ వైసీపీ ప్రభుత్వం విజయ సాయి రెడ్డి అల్లుడు పనిచేస్తున్న అరబిందో ఫార్మా ఫౌండేషన్ కు కట్టబెట్టడం జరిగిందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.

 

ఈ కాంట్రాక్టు పనుల వల్ల ఐదు సంవత్సరాలకు గాను అరబిందో ఫార్మా ఫౌండేషన్ కు 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి అందుతున్నాయని, దీని వెనకాల కుట్ర ఉందని వాస్తవ విషయాలు బయట పడాలి అంటే అరబిందో చైర్మన్ రాంప్రసాద్ రెడ్డి పాత్రను కూడా నిగ్గు తేల్చాలని కన్నా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుతం ఉన్న దూకుడు చూస్తుంటే వెయ్యి కోట్ల స్కాం లో విజయ్ సాయి రెడ్డి ని పట్టుకునేదాకా నిద్రపోయేలా లేరు గా అన్నట్టుగా ఉంది . ఈ విషయాన్ని త్వరలో ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడానికి కూడా కన్నా లక్ష్మీనారాయణ  రెడీ అవుతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: