ఈ మద్య తెలంగాణలో వరుసగా ప్రజా ప్రతినిధులకు కరోనా సోకుతున్న విషయం తెలిసిందే.  జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆయన సతీమణితో సహా మరో ముగ్గురికి కరోనా అని తేలడం తెలిసిందే.  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌కు కరోనా సోకినట్లుగా వైద్యాధికారులు ఆదివారం నిర్ధరించారు.  మూడు రోజుల నుంచి ఎమ్మెల్యే బాజిరెడ్డి దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు.  పరీక్షల్లో బాజిరెడ్డికి పాజిటివ్‌, భార్యకు నెగెటివ్‌ రావడంతో ఆయన కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు.

 

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న బిగాల గణేష్ గుప్తాకు కూడా కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. వరుసగా ప్రజా ప్రతినిధులకు కరోనా వైరస్ సోకడం కలకలం రేపుతోంది. నిజామాబాద్ లో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే వారిలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కు కరోనా సోకకముందు శనివారం ఆయన డిచ్ పల్లి మండలం బీబీపూర్ తండాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

 

ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా తండాలో అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఐదుగురు ప్రైమరీ కాంటాక్ట్స్ ను గుర్తించి వారిని వైద్యాధికారులు హోం క్వారంటైన్ చేశారు. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు.  కరోనాకి వ్యాక్సిన్ లేని కారణంగా మనం జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం అని అధికారులు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: