అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారాలు, కావాల్సినంత మంది అధికారులు, స్పష్టమైన విధానాలు, పాలనా సౌలభ్యంగా గ్రామాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలోని పల్లెలన్నీ బాగుపడి తీరాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ఇన్ని అనుకూలతలున్న ప్రస్తుత పరిస్థితుల్లో కాకపోతే, ఇంకెప్పుడూ గ్రామాలు బాగుపడవని ముఖ్యమంత్రి అన్నారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో వసతుల కల్పనకు, అవసరమైన పనులు చేసుకోవడానికి నరేగా పథకాన్నివ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని సీఎం చెప్పారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రైతుల భూముల్లో లక్ష కల్లాలను ఏర్పాటు చేయాలని కోరారు.

 

 ప్రతీ గ్రామం ప్రతీ రోజు శుభ్రం కావాల్సిందేనని, ముఖ్యమంత్రి సహా రాష్ట్రంలో అధికార యంత్రాంగంలో ఎవరికైనా సరే గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి మించిన పని మరోటి లేదని సీఎం స్పష్టం చేశారు. రాబోయే రెండు నెలల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం, నాలుగు నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. రాబోయే నాలుగేళ్లలో ఏ గ్రామంలో ఏ పని చేయాలనే విషయంలో ప్రణాళికలు రూపొందించాలని, దానికి అనుగుణంగానే పనులు చేయాలని, ఈ వివరాలతో డిస్ట్రిక్ట్ కార్డు తయారు చేయాలని సీఎం చెప్పారు.   జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో ఇవాళ సమావేశమయ్యారు. 


ఉపాధి హామీ నిధులతో వీలైనన్ని ఎక్కువశాఖల్లో పనులు చేపట్టేలా ప్రణాళికలుసిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రూ.750 కోట్లతో లక్ష కల్లాలు నిర్మించేందుకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో పాటు నీటిపారుదలశాఖలో కాలువలు, డిస్టిబ్యూటరీల పనులు ఉపాధి హామీ నిధులతో చేపట్టనున్నారు. అనేక ఇత‌ర విష‌యాల‌ను కూడా మంత్రులు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు ముఖ్య‌మంత్రి దృష్ట‌కి తీసుకెళ్లారు. గ్రామాల్లో కలెక్టర్లు, డిపిఓ ఆధ్వర్యంలో జరగాల్సిన పనులపై ముఖ్యమంత్రి మార్గదర్శకం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: