వైసీపీ అసంతృప్త ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ‌కృష్ణం రాజును వైసీపీ నుంచి సస్పెండ్ చేయ‌డం ఒక్క‌టే మిగిలి ఉందా ? అంటే ఆ పార్టీలో తాజా ప‌రిణామాలు అవున‌నే చెపుతున్నాయి. నిన్న‌టికి నిన్న తాను జ‌గ‌న్ బొమ్మ పెట్టుకుని గెల‌వ‌లేద‌ని.. త‌న బొమ్మ‌తోనే త‌న‌తో పాటు అక్క‌డ ఎమ్మెల్యేలు గెలిచార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై సీరియ‌స్ అయిన సీఎం జ‌గ‌న్ అక్క‌డ న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల‌తో ర‌ఘుకు ఘాటైన కౌంట‌ర్ ఇప్పించారు. ఓవ‌రాల్‌గా  ఈ ఎమ్మెల్యేలు అంద‌రూ ర‌ఘురామ కృష్ణంరాజును దారుణంగా టార్గెట్ చేశారు. ఇక ఫైన‌ల్‌గా వైసీపీ అధిష్టానం కూడా ర‌ఘుతో తాడోపేడో తేల్చుకుని వేటు వేసేందుకు దాదాపు రెడీ అయ్యింద‌ని అంటున్నారు.

 

ఇప్ప‌టికే ఈ విష‌య‌మై జ‌గ‌న్ కొంద‌రు పెద్ద‌ల‌తో కూడా చ‌ర్చించార‌ని స‌మాచారం. రఘురామ కృష్ణం రాజుపై చర్యలకు అధిష్ఠానం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.  వైసీపీ ఏడాది పాలనలో కులరాజకీయం, అవినీతి, ఇసుక, ల్యాండ్ మాఫియా పెరిగిపోతున్నాయంటూ రఘురామరాజు గతకొంతకాలంగా బహిరంగ విమర్శలు చేస్తున్నారు. జ‌గ‌న్ ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా ర‌ఘు మాత్రం ప్ర‌భుత్వాన్ని, పార్టీని ఇరుకున పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ముందుగా షో కాజ్ నోటీసులు జారీ చెయ్యాలని ఆ పార్టీ అధినేత జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. సరైన జవాబు రాకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యడానికి కూడా వెనకాడబోమన్న సంకేతాలు ఇచ్చారని.. అధికార పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

 

అందుకే ముందుగా పార్టీకి చెందిన న‌ర‌సాపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఎమ్మెల్యేల‌తో ఒకేసారి కౌంట‌ర్ ఎటాక్ లు ఇప్పించార‌ని తెలుస్తోంది. ఈ ప‌రిణామాల త‌ర్వాత ఎంపీ రఘు సైతం పార్టీలో ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని.. ఆయ‌న ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ తీసుకున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: