అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్నా జగన్ పార్టీకి శాసన మండలిలో మాత్రం తగినంత బలం లేని సంగతి తెలిసిందే. శాసన మండలిలో మెజార్టీని అడ్డుపెట్టుకునే గతంలో టీడీపీ మూడు రాజధానుల బిల్లును అడ్డుకుంది. సెలక్టు కమిటీకి పంపింది. దీంతో తిక్కరేగిన జగన్ ఏకంగా మండలినే రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కానీ అది అమల్లోకి రావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

 

 

ఈ నేపథ్యంలో టీడీపీ ఇప్పుడు మరోసారి తన మెజారిటీ పవర్ ను చూపించింది. శాసన మండలిలో బలం ఎక్కువగా ఉన్న తెలుగుదేశం పార్టీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చేసిన ప్రసంగానికి సవరణలు ప్రతిపాదించింది. ఆ తర్వాత శాసన మండలి ఈ సవరణలను మూజువాణి ఓటుతో ఆమోదించింది.

 

 

మండలిలో సంఖ్యాబలం ఉన్న టీడీపీ గవర్నర్ ప్రసంగానికి ఇచ్చిన సవరణలు ఇవీ..

"రాష్ట్ర జీడీపీ, తలసరి ఆదాయం సరైనవి కావు. ఆ పేరా తొలగించాలి, బలహీనవర్గాల సంక్షేమం, రాజధాని అమరావతి, పోలవరం, ఇతర సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం విస్మరించింది. అందువల్ల గవర్నర్‌ ప్రసంగంలోని ముగింపు పేరాను తొలగించాలి. రాజ్యాంగ నియమాలకు, సుప్రీంకోర్టు, హైకోర్టు సూచనలకు విరుద్దంగా ఆర్డినెన్స్‌లు జారీ చేశారు. ఆ ప్రస్తావనలు తొలగించాలి. విద్యుత్‌ ఒప్పందాలు, నవరత్నాల అమలు లో గవర్నర్‌ ప్రసంగం తప్పుదోవపట్టించేలా ఉందని, వీటికి సంబంధించిన పేరా తొలగించాలి. గవర్నర్‌ ప్రసంగంలో అభివృద్ధి సంక్షేమాలకు సంబంధించిన సమాచారం సరైనది కాదు. అవి తొలగించాలి.”

 

 

అయితే ఈ సవరణలతో ఒరిగేదేమీ ఉండదు. దీన్ని వల్ల తెలుగు దేశం సర్కారు తన ఆధిపత్యం ప్రదర్శించడం తప్ప జగన్ సర్కారుకు వచ్చిన ఇబ్బందీ ఉండదు. అయితే తెలుగు దేశం అనుకూల మీడియా మాత్రం దీన్ని హడావిడి చేస్తోంది. ఏపీ సర్కారుకు మండలి ఝలక్ అంటూ బ్రేకింగులు వేస్తూ కాస్త ఆనందం పొందుతోంది. ఇది కేవలం గవర్నర్‌కు ధన్యవాదాలు తెలియజేసే తీర్మానం కాబట్టి సవరణలకు విలువ ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: