కొన్ని రోజుల క్రితం బంజారాహిల్స్ భూవివాదం కేసులో షేక్‌పేట ఎమ్మార్వో సుజాత పట్టుబడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఆమె భర్త అజయ్ కుమార్ అవమానభారంతో మృతి చెందారు. గాంధీనగర్‌లోని తన సోదరి నివాసానికి వచ్చిన అజయ్ అయిదంతస్తుల భవనం పైనుంచి దూకి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 
 
భార్య ఏసీబీకి పట్టుబడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన అజయ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తాజాగా పోలీసులు ఈ కేసులో అజయ్ కుమార్ గురించి కూడా విచారించనట్లు తెలుస్తోంది. బంజారాహిల్స్ భూవివాదం, ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో ఇటీవలే పోలీసులు సుజాతను అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం.14 లోని రూ. 40 కోట్ల విలువైన భూమి కేసులో లంచం తీసుకున్నట్లు తేలడం, ఇంట్లో దొరికిన రూ.30 లక్షలకు సరైన ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు అధికారులను అరెస్ట్ చేశారు. 
 
నగదు అంతా కూడా తన సంపాదనేనని సుజాత అధికారుల విచారణలో చెప్పారని సమాచారం. ప్రభుత్వ పత్రాల గురించి మాత్రం ఆమె స్పందించలేదని తెలుస్తోంది.  వీఆర్‌ఓ లత సహకారంతో ఆమె అవినీతికి పాల్పడుతున్నట్లుగా అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అబ్దుల్ సయ్యద్ ఖలీద్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్లు ఆధారాలు లభ్యం కావడంతో ఆమెను అరెస్ట్ చేశారు. 
 
అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరపరచగా ఆమెకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు అరెస్ట్ అయ్యారు. భారీ మొత్తంలో సుజాత డబ్బు డిమాండ్‌ చేయడం వెనుక ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు  అజయ్ ఆత్మహత్య చేసుకోవడానికి అవమానభారం కారణమని కొందరు చెబుతుంటే.... మరికొందరు ఏసీబీ అధికారుల వేధింపుల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: