సొంత పార్టీలోనే ఇప్పుడు రచ్చ మొదలవడం తో ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉంది. ఒక పక్క తెలుగుదేశం పార్టీని తాము ఇబ్బందులకు గురి చేస్తున్నామని, ఆ పార్టీ నుంచి పెద్దఎత్తున నాయకులను చేర్చుకుని టిడిపికి ఝలక్ ఇవ్వబోతున్నామని, అలాగే ఇప్పటికే టిడిపి నాయకులు కొంత మందిని అరెస్టు చేసి జైలుకి పంపించి తెలుగుదేశం పార్టీకి గట్టి ఝలక్ ఇచ్చామనే సంతోషంలో వైసిపి నాయకులు ఉండగా, ఇప్పుడు సొంత పార్టీ ఎంపీ పదేపదే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ప్రతిపక్షాలకు ఆయుధాలను అందిస్తుండడం వైసీపీ నాయకులకు మింగుడుపడటంలేదు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొద్దిరోజులుగా అదేపనిగా జగన్ పైనా, వైసీపీ ప్రభుత్వం పైనా విమర్శలు చేస్తూ వస్తున్నారు. 

 

పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు తన దయా దాక్షిణ్యాలపైనే గెలిచారు అంటూ ఆయన వ్యాఖ్యానించడంపై వైసీపీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రఘురామకృష్ణంరాజు సొంతంగా గెలిచే అంతా పోటుగాడు అయితే, అన్ని పార్టీలు ఎందుకు మారాల్సి వచ్చింది అనే విషయంపై సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు తో చర్చలు జరిపి బీజేపీ కండువా కప్పుకున్నారు అంటూ నాని మండిపడ్డారు. సొంతంగా గెలిచే సత్తా ఉంటే మూడు పార్టీలు ఎందుకు మారాల్సి వచ్చిందని, సొంతంగానే పార్టీ పెట్టి పోటీ చేస్తే సరిపోయేది కదా అని సలహా ఇచ్చారు. 

 

ఎవరో పార్టీ పెడితే వారి పంచన చేరాల్సిన అవసరం ఎందుకొచ్చింది అని నిలదీశారు. వైసీపీలో చేరేందుకు ఎంతమందితో రాయబారాలు నడిపించారో గుర్తులేదా అంటూ నాని ప్రశ్నించారు. అన్ని రాయబారాలతో పార్టీలో చేరి ఇప్పుడు ఈ విధంగా వ్యవహరించడం ఒక్క రఘురామకృష్ణంరాజు కు మాత్రమే చెల్లిందన్నారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే తక్కువ స్థాయిలో రఘురామకృష్ణం రాజు కి ఓట్లు వచ్చాయని, ఆయనే కనుక ఎమ్మెల్యేలందరినీ గెలిపించినట్టయితే వారి కంటే తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయో చెప్పాలంటూ నాని డిమాండ్ చేశారు. వైసీపీ నుంచి గెలిచిన 23 మంది టీడీపీ ఎమ్యెల్యేలు, ముగ్గురు ఎంపీలు టీడీపీలో చేరారని, వారి పరిస్థితి ఇప్పుడు ఏమైందో చూసారు కదా అంటూ నాని వ్యాఖ్యానించారు.

 

అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేయించారని చెబుతున్నారు కదా తమిళనాడులో చిదంబరం ను మోదీ ఎలా అరెస్ట్ చేయించారో తెలియదా అంటూ నాని ప్రశ్నించారు. మొత్తంగా చూస్తే రఘురామ కృష్ణం రాజు బీజేపీలోకి వెళ్లేందుకు దాదాపు ఫిక్స్ అయిపోయారని భావిస్తున్న వైసీపీ ఇప్పుడు ఆయనపై పూర్తిగా ఫోకస్ పెంచి విమర్శలు మొదలు పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: