తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌ర్కారు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అన్నదాత‌ల కోసం ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంటున్న టీఆర్ఎస్ స‌ర్కారు తాజాగా ఇంకో ముఖ్య‌మైన ప్ర‌క‌ట‌న చేసింది. రైతుల కోసం నిర్మిస్తున్న ప్రాంగ‌ణాల‌కు ఇంట‌ర్నెట్ అందుబాటులోకి తేనుంది. త్వరలో తెలంగాణలో అందుబాటులోకి రానున్న రైతు వేదికలన్నింటినీ టీ-ఫైబర్‌ ద్వారా అనుసంధానించాలని అధికారులను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. దీంతో రైతుల‌కు ఇంట‌ర్నెట్ సేవ‌లు మ‌రింత స‌మ‌గ్రంగా అందుబాటులోకి రానున్నాయి. 

 


తెలంగాణ ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టుపై మంత్రి కేటీఆర్‌ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజక్టు పూర్తయితే ప్రభుత్వం నుంచి ప్రభుత్వం (జీ టు జీ), ప్రభుత్వం నుంచి పౌరులు (జీ టు సీ) వరకు అందించే సేవల్లో గణనీయమైన మార్పులు వస్తాయన్నారు. త్వరలో తెలంగాణలో అందుబాటులోకి రానున్న రైతు వేదికలన్నింటినీ టీ-ఫైబర్‌ ద్వారా అనుసంధానించాలని అధికారులను ఆదేశించారు. సొంత గ్రామాల నుంచి రైతు వేదికల ద్వారా రైతులు నేరుగా సీఎం, మంత్రి, వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వా రా మాట్లాడుకొనే అవకాశం కలిగేలా ఉండాలన్న సీఎం ఆలోచన మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్​ ఆదేశించారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, ఇతర అంశాలపై చర్చించే సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాలను ప్రపంచంతో అనుసంధానించేలా ఈ ప్రాజెక్టు ఉండబోతున్నదని పేర్కొన్నారు.

 


టీ ఫైబర్​ ప్రాజెక్టు పూర్త్తయ్యాక ఆన్‌లైన్‌ విద్య, వైద్యం, వ్యవసాయ సేవల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని మంత్రి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోకి కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చి.. డిజిటల్‌ కంటెంట్‌ ప్రజలకు చేరువవుతుందని మంత్రి కేటీఆర్‌ వివరించారు. కరోనాపై యుద్ధంలో డిజిటల్‌ మౌలిక వసతులు ప్రభుత్వానికి ఉపయుక్తంగా మారాయని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌, ఆన్‌లైన్‌ హెల్త్‌కేర్‌, ఈ కామర్స్‌ సేవల అవసరాల నేపథ్యంలో ప్రతి రాష్ట్రం లేదా దేశం బలమైన డిజిటల్‌ నెట్‌వర్క్‌ను కలిగి ఉండాల్సిన తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రస్తుతం లక్షల మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం అవకాశాన్ని వినియోగించుకొని పనిచేస్తున్నారని గుర్తుచేశారు. ఐటీ, దాని అనుబంధ రంగాల్లో ఈ పరిస్థితి భవిష్యత్‌లోనూ కొనసాగే అవకాశమున్నదని మంత్రి తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: