కరోనా పాజిటివ్ కేసులతో తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగులు బిక్కు బిక్కుమంటున్నారు. వరుస పాజిటివ్ కేసులు బయటపడుతుండటంతో ఉద్యోగులు భయపడిపోతున్నారు. కేసులు పెరిగితే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. అవసరమైన మేరకే ఉద్యోగులను విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

 

తెలంగాణ సచివాలయంలో కరోనా పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇక్కడ పనిచేసే ఉద్యోగులను కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటికే ఆరుగురికి కరోనా సోకడంతో.. ఎప్పుడు ఎవరికి పాజిటివ్‌గా నిర్ధారణ అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆఫీసుకు రావాలంటేనే జంకుతున్నారు ఉద్యోగులు. 

 

బీఆర్కే భవన్‌లో తక్కువ ప్లేస్‌లోనే ఎక్కువ సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ భౌతిక దూరం పాటించడం అంత ఈజీ కాదు. రెగ్యులర్‌గా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఫైనాన్స్ శాఖలోనే ముగ్గురికి కరోనా సోకింది. ఇందులో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీఎస్ కూడా ఉన్నారు.

 

ఆ శాఖలో పనిచేసే ఇద్దరు అటెండర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఒక ఐఏఎస్‌తో పాటు 30మంది ఆర్థికశాఖ ఉద్యోగులు హోం క్వారంటైన్‌కి వెళ్లారు. పీఎస్‌కి కరోనా రావడంతో ఆ విభాగంలో పనిచేసే వాళ్ళు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. 

 

ఇక...ఆరోగ్య శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి కరోనా రావడంతో ఆ శాఖలోని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆ శాఖలో ఉద్యోగులకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఆరోగ్య శాఖ సలహాదారుకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో హెల్త్ మినిస్టర్ పేషీలో పని చేసే సిబ్బంది భయపడుతున్నారు. ఐటీ డిపార్ట్మెంట్‌లో పని చేసే ఉద్యోగికి కరోనా వచ్చింది. దీంతో ఆ ఉద్యోగితో కాంటాక్ట్‌లో ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు. 

 

అయితే...మరిన్ని  కరోనా పాజిటివ్ కేసులు పెరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఉద్యోగులు. బిఆర్కే భవన్‌లోని కొన్ని విభాగాలను తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: