ఏపీలో కులాల ఆధారంగానే రాజకీయాలు నడుస్తాయన్న సంగతి తెలిసిందే. ఏదైనా కులాల ప్రతిపాదికనే పార్టీల అధినేతలు రాజకీయాలు చేస్తుంటారు... నేతలకు ప్రాధాన్యత ఇస్తారు. ఎన్నికల్లో సీట్లు కేటాయింపు దగ్గర నుంచి పార్టీలో పదవులు కేటాయింపులు వరకు ఇలాగే జరుగుతాయి. ఇక అధికారంలో ఉన్న పార్టీ అయితే మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదానిలోనూ కులాల ఆధారంగానే పదవుల పంపకాలు చేస్తుంటారు.

 

అయితే ఇటీవల రాష్ట్రంలో మంత్రి పదవుల విషయం గురించి చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. మండలి రద్దు నేపథ్యంలో పిల్లి సుబాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల పదవులు పొనున్న సంగతి తెలిసిందే. ఇక వీరికి జగన్ రాజ్యసభలు కూడా ఇచ్చేశారు. అయితే ఈ ఇద్దరు తప్పుకోనుండటంతో నెక్స్ట్ వారి పదవులు ఎవరికి ఇస్తారనే ఆసక్తికర చర్చ వస్తుంది. ఇప్పటికే మంత్రి పదవుల రేసులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.

 

కాకపోతే సామాజికవర్గాల పరంగా చూసుకుంటే పిల్లి తప్పుకుంటే అదే సామాజికవర్గం అంటే గౌడ/శెట్టిబలిజ నేతకే పదవి ఇవ్వాలి. అలాగే మోపిదేవి వెంకటరమణ స్థానంలో మత్స్యకార సామాజికవర్గానికి చెందిన నేతకు పదవి కట్టబెట్టాలి. అయితే మోపిదేవి విషయం పక్కనబెడితే పిల్లి సామాజికవర్గానికి చెందిన పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ లేదా పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్‌ల్లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలి. కానీ అలా ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే ఆ సామాజికవర్గం కాస్త అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. ఎందుకంటే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడూ గౌడ/శెట్టిబలిజ వర్గానికి రెండు మంత్రి పదవులు ఇచ్చారు. కేఈ కృష్ణమూర్తి, పితాని సత్యనారాయణలకు కేబినెట్‌లో చోటు ఇచ్చారు. ఇందులో కేఈ డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. అయితే ఇప్పుడు జగన్ ఉన్న ఒక్క పదవిని తీస్తే ఇబ్బందే. మరి చూడాలి ఈ విషయంలో జగన్ వేరే ప్రత్యామ్నాయం ఏమన్నా ఆలోచిస్తారేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: