జగన్ పాలనకు ఏడాది పూర్తయిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో జగన్ పాలన అద్భుతంగా నడిచిందనే చెప్పొచ్చు. ఎక్కువ శాతం ప్రజలు జగన్ పాలన పట్ల సంతృప్తిగానే ఉన్నారు. ఇదే సమయంలో మంత్రుల పట్ల మాత్రం ప్రజలు పెద్దగా సంతృప్తిగా లేరని తెలుస్తోంది. కొందరు మంత్రుల పనితీరు బాగుంటే...కొందరిది మాత్రం బాగోలేదు. అసలు కొందరు మంత్రులన్న సంగతి కూడా చాలమందికి ప్రజలు తెలియదు. అయితే ఇలా మంత్రుల మీద చర్చలు నడుస్తున్న నేపథ్యంలో, పనితీరు బాగోని వారిని పక్కనబెట్టేసి జగన్ కొత్తవారికి అవకాశం ఇస్తారని అంటున్నారు.

 

ఎలాగో పిల్లి సుబాష్, మోపిదేవి వెంకటరమణల పదవులు ఖాళీ అవ్వడంతో, వారి స్థానంలో వేరేవారిని భర్తీ చేయాలి. వీటితో పాటే మరికొన్ని మంత్రి పదవులు జగన్ భర్తీ చేస్తారని తెలుస్తోంది. దీంతో మంత్రి పదవి కోసం చాలామంది సీనియర్ నేతలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కావాలని మాజీ మంత్రి పార్థసారథి కూడా ఆరాటపడుతున్నారు. గతంలో వైఎస్సార్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న సారథి...2019 ఎన్నికల్లో పెనమలూరు నుంచి గెలిచారు. సీనియర్ నేత కావడంతో పాటు, యాదవ సామాజికవర్గంలో తనకు పదవి వస్తుందని సారథి ఆశపడ్డారు.

 

కానీ జగన్ మాత్రం పార్టీకి వీరవిధేయుడు యువనాయకుడు అనిల్ కుమార్ యాదవ్‌కు మంత్రి పదవి ఇచ్చారు. ప్రస్తుతం మంత్రిగా అనిల్ మంచి పనితీరు కనబరుస్తున్నారు. దీనికి తోడు ప్రతిపక్ష టీడీపీకి చెక్ పెట్టడంలో అనిల్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అసెంబ్లీలో కావొచ్చు, మీడియా ముందు కావొచ్చు ఎక్కడైనా అనిల్ టీడీపీకి చెక్ పెట్టేస్తున్నారు. దీంతో అనిల్‌ని మంత్రి పదవి నుంచి తొలగించడం చాలా కష్టం.

 

అసలు అనిల్‌ని తప్పించి జగన్...సారథికి ఛాన్స్ ఇవ్వడమనేది కష్టమే. కానీ యాదవ సామాజికవర్గంలోనే రెండో పదవి ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా సారథికే ఇస్తారు. ఒకవేళ సారథికి మంత్రి పదవి ఇవ్వకపోయినా...ఏదైనా మంచి నామినేటెడ్ పదవి ఇవ్వడానికి జగన్ సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: